సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ అరెస్ట్‌ | Telugu Producer Bandla Ganesh Arrested in Jubilee Hills | Sakshi
Sakshi News home page

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ అరెస్ట్‌

Oct 23 2019 7:27 PM | Updated on Oct 23 2019 8:20 PM

Telugu Producer Bandla Ganesh Arrested in Jubilee Hills - Sakshi

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను బుధవారం జూబ్లిహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను బుధవారం జూబ్లిహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కడప జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు నాన్‌బెయిబుల్‌ వారెంట్‌ జారీ చేయడంతో ఆయనను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కడప జిల్లాకు చెందిన మహేష్ అని వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ 13 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. తిరిగివ్వకపోవడంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. విచారణకు హాజరుకాకపోవడంతో బండ్ల గణేశ్‌పై కోర్టు వారెంట్‌ జారీ చేసింది. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో రేపు ఆయనను హాజరుపరచనున్నారు.

తన అనుచరులతో కలసి ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్‌ వి.పొట్లూరి(పీవీపీ)ను బెదిరించిన కేసులోనూ బండ్ల గణేశ్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తనను హత్య చేసేందుకు తన ఇంటిపైకి కొందరు రౌడీలను బండ్ల గణేశ్‌ పంపించారని ఈనెల 5న జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో పీవీపీ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బండ్ల గణేశ్, అతడి అనుచరుడు కిశోర్‌పై ఐపీసీ సెక్షన్‌ 420, 448, 506, 109 కింద క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

బండ్ల గణేశ్‌ గతంలోనూ పలు కేసులు ఎదుర్కొన్నారు. నీ జ‌త‌గా నేనుండాలి సినిమా విషయంలో తనను బండ్ల గణేశ్‌ మోసం చేశాడని మూడేళ్ల క్రితం హీరో సచిన్‌ జోషి ఫిర్యాదు చేశారు. సినిమా లాభాల్లో వాటా ఇస్తాన‌ని చెప్పి మాట తప్పడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయ రవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నీ జ‌త‌గా నేనుండాలి సినిమాకు గ‌ణేష్ ప్రొడ్యూస‌ర్‌గా ఉన్నప్పటికీ ఆ సినిమా నిర్మాణానికి పెట్టుబడి పెట్టింది సచిన్ జోషినే. ఈ సినిమా విషయంలో గ‌ణేష్ త‌న‌ని మోసం చేశాడ‌ని, డిస్ట్రిబ్యూషన్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని సచిన్‌ తరపున వైకింగ్ మీడియా అప్పట్లో ఫిర్యాదు చేసింది. (చదవండి: బండ్ల గణేశ్‌ తోడేలు లాంటివాడు)

చెక్కు బౌన్స్‌ కేసులో బండ్ల గణేశ్‌కు 2017 నవంబర్‌లో ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. (చదవండి: ఇది ‘టెంపర్’ చిత్ర వివాదం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement