ఇద్దరిని మింగిన క్వారీ గుంత

Teen Girls Missing in Quarry Water Kalikiri Chittoor - Sakshi

నీటిలో గల్లంతైన యువతి, బాలిక

వెలికితీయాలనే స్థానికుల ప్రయత్నం విఫలం

కలికిరి: సాయంకాలం అలా ఆహ్లాదంగా గడుపుదామని గ్రామం సమీపంలోని క్వారీ గుంత వద్దకు వెళ్లిన ఓ యువతి, బాలిక నీట మునిగిపోయారు. ఈ çఘటన గురువారం సాయంత్రం కలికిరి మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పల్లవోలు గ్రామం గడి–గ్యారంపల్లి మార్గంలో పాకాలకు చెందిన టీడీపీ నాయకుడు, కాంట్రాక్టరు విశ్వనాథనాయుడుకు చెందిన మూతబడిన క్వారీ ఉంది. క్వారీ లోపల గుంతల్లో గతంలో కురిసిన వర్షాలకు నీరు చేరింది. అడుగున బండరాయి ఉండడంతో నీరు ఆహ్లాదంగా కనిపిస్తోంది. చుట్టుపక్కల గ్రామస్తులు అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి ఈతకొట్టివాతావరణాన్ని ఆస్వాదించేవారు. ఈ క్రమంలోనే గడికి చెందిన షేక్‌ ఇస్మాయిల్, రేష్మల ఇంటికి చౌడేపల్లి మండలం పెద్దూరుకు చెందిన  నజీర్‌ సాబ్‌ భార్య ముంతాజ్, కుమార్తె చష్మా(20), పుంగనూరు కొత్త ఇండ్లుకు చెందిన యువకుడు షాహీద్‌(18) వచ్చారు.

గురువారం షేక్‌ ఇస్మాయిల్‌ బంధువైన గడి గ్రామానికే చెందిన సయ్యద్‌ బాషా ఇంటి నిర్మాణంలో భాగంగా ఇంటి స్లాబ్‌ పనులు చేపట్టారు. సాయం కాలం స్లాబ్‌ పని పూర్తయిన తరువాత ఇస్మాయిల్‌ కుమార్తెలు షబ్రీన్, అఫ్రీన్, వారి ఇంటికి వచ్చిన చౌడేపల్లి మండలం పెద్దూరుకు చెందిన ముంతాజ్, ఆమె కుమార్తె చష్మా, రోహీద్‌ కలిసి క్వారీ వద్దకు వెళ్లారు. అక్కడ ఐదుగురు కలిసి నీటిలో దిగారు. నీటి లోతు తెలియక పోవడం, వారిలో ఎవరికీ ఈత రాకపోవడంతో కొంత లోతుకెళ్లి ఉక్కిరిబిక్కిరయ్యారు. గమనించిన షాహీద్‌ ముంతాజ్‌ను ఒడ్డుకు లాగాడు. షబ్రీన్‌ అప్పటికే గట్టుకు చేరుకుంది. చష్మా(20), అఫ్రీన్‌(14) నీటిలో మునిగిపోయారు. గట్టున ఉన్న వారు కేకలు వేశారు. సమాచారం గడివాసులకు తెలియచేయడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరు కుని వెతికినా బాలికల ఆచూకీ లభించలేదు. సుమారు గుంత 40 నుంచి 50 అడుగుల లోతు ఉండడంతో స్థానికులు వారిని వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రామాంజనేయులు రాత్రి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శుక్రవారం బాలికలను వెలికితీతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top