‘సాక్షి’ రిపోర్టర్‌పై టీడీపీ నేత దౌర్జన్యం | TDP Leader Attacks On Sakshi Media Reporter In Guntur | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ రిపోర్టర్‌పై టీడీపీ నేత దౌర్జన్యం

Mar 27 2019 10:01 AM | Updated on Mar 27 2019 11:31 AM

TDP Leader Attacks On Sakshi Media Reporter In Guntur

టీడీపీ నేత మైనేని మురళిని తీసుకువెళుతున్న పోలీసులు 

‘సాక్షి’ చానల్‌ ప్రతినిధి రామకృష్ణ వీడియో తీస్తుండగా టీడీపీ నేత మైనేని మురళీకృష్ణ రామకృష్ణను బలంగా నెట్టివేసి..

సాక్షి, వేమూరు: గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ ‘సాక్షి’ చానల్‌ రిపోర్టర్‌పై తెలుగుదేశం పార్టీ నేత, పశ్చిమ కృష్ణా డెల్టా చైర్మన్‌ మైనేని మురళీకృష్ణ దౌర్జన్యానికి పాల్పడ్డారు. కొల్లూరు మండలం చిలుమూరుపాలెం గ్రామంలో కాపు సామాజికవర్గ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. చిలుమూరుపాలెంకు చెందిన కాపులు, చిలుమూరు గ్రామస్తులు ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో చిలుమూరు శ్రీరామా రూరల్‌ కళాశాలలోని పోలింగ్‌ బూత్‌లో ఓట్లు వేస్తారు.

అయితే ఎన్నికల కమిషన్‌ ప్రైవేటు కళాశాలల్లో పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయరాదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆ కళాశాలలో పోలింగ్‌ బూత్‌ రద్దు చేసి చిలుమూరు దళితవాడలోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్‌ బూత్‌  ఏర్పాటు చేసింది. దీంతో చిలుమూరుపాలెం గ్రామస్తులు దళితవాడలో ఏర్పాటు చేసిన పోలింగ్‌బూత్‌ను రద్దు చేసి శ్రీరామారూరల్‌ కళాశాలలో ఏర్పాటు చేయాలని లేదా చిలుమూరుపాలెం గ్రామంలో పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేయాలని వేమూరు తహసీల్దారు కార్యాలయంలో ఉన్న నియోజకవర్గ ఎన్నికల అధికారికి వినతిపత్రం అందజేసేందుకు వచ్చారు. అదే సమయంలో అక్కడకు పశ్చిమ కృష్ణా డెల్టా ప్రాజెక్ట్‌ చైర్మన్, టీడీపీ నేత మైనేని మురళీకృష్ణ రాగా చిలుమూరుపాలెం గ్రామస్తులు ఆయన్ను ఈ విషయమై నిలదీశారు.

దళితవాడలో పోలింగ్‌ బూత్‌ రద్దు చేసి చిలుమూరుపాలెంలో గాని లేదా శ్రీరామ రూరల్‌ కళాశాలలోగాని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ చానల్‌ ప్రతినిధి రామకృష్ణ వీడియో తీస్తుండగా టీడీపీ నేత మైనేని మురళీకృష్ణ రామకృష్ణను బలంగా నెట్టివేసి దౌర్జన్యానికి పాల్పడారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని మైనేని మురళీకృష్ణను పక్కకు తీసుకువెళ్లారు. అనంతరం జరిగిన సంఘటనపై సాక్షి చానల్‌ రిపోర్టర్‌ రామకృష్ణ వేమూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement