పట్టుబడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే తనయుడు | TDP Ex MLA Son Held in Alcohol Smuggling Case Anantapur | Sakshi
Sakshi News home page

అక్రమార్జనకు బరితెగింపు

Jun 3 2020 8:45 AM | Updated on Jun 3 2020 8:45 AM

TDP Ex MLA Son Held in Alcohol Smuggling Case Anantapur - Sakshi

నిందితులను చూపుతున్న పోలీసులు

అనంతపురం, రాయదుర్గం రూరల్‌: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల్లో కొందరు అక్రమార్జన కోసం బరి తెగిస్తున్నారు. పొరుగునే ఉన్న కర్ణాటక నుంచి అడ్డదారుల్లో మద్యం తీసుకొచ్చి అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు ఇసుకను అక్రమంగా రవాణా చేసి దండుకుంటున్నారు. రాయదుర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండి హులికుంటప్ప తనయుడు విక్రమ్‌కుమార్‌ అలియాస్‌ విక్కీ పట్టపగలే కర్ణాటక మద్యంతో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 30న కేఏ 34ఏ5856 నంబరుగల టాటా ఏస్‌ లగేజ్‌ వాహనాన్ని రాయదుర్గంలోని మొలకాల్మూరు రోడ్డులో గల ఎక్సైజ్‌ చెక్‌పోస్టులో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ధనుంజయ ఆధ్వర్యంలో ఎక్సైజ్‌ సీఐ కృష్ణ, ఎక్సైజ్‌ ఎస్‌ఐ షేక్షావలి తదితరులు ఆపి తనిఖీ చేశారు. అందులో 624 కర్ణాటక మద్యం బాటిళ్లు దొరికాయి. వీటిని అక్రంగా రవాణా చేస్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన మహమ్మద్‌ ఆసిఫ్, కోల్‌కతాకు చెందిన విశాల్‌ రాజ్‌బహర్, రాయదుర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బండి హులికుంటప్ప కుమారుడు విక్రమ్‌కుమార్‌తో పాటు వాహన యజమాని మహమ్మద్‌ అన్సర్‌ను పట్టుకుని ఎక్సైజ్‌ సీఐ పవన్‌కుమార్, అర్బన్‌ సీఐ తులసీరాం కేసు నమోదు చేశారు. వీరు తరచూ అక్రమంగా మద్యం తరలిస్తుండేవారని పోలీసుల విచారణలో తేలింది.

పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి
కర్ణాటక మద్యంతో పట్టుబడిన వారిపై కేసు నమోదు చేయకుండా చూడాలని ఎక్సైజ్‌ పోలీసులపై టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశారు. అయితే దాడుల్లో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అధికారుల పాత్ర ఉండటంతో వారి ఒత్తిళ్లు ఫలించలేదు. చేసేది లేక మూడు రోజుల తర్వాత ఈ కేసు గురించి మీడియాకు వెల్లడించారు.

టీడీపీ నేతల అక్రమాల్లో మచ్చుకు కొన్ని..
రాయదుర్గానికి చెందిన టీడీపీ నేత సోమా నాగేంద్ర గుట్కా ప్యాకెట్ల అక్రమంగా రవాణా చేస్తూ మే 31న పట్టుబడ్డాడు.
డి.కొండాపురం గ్రామానికి చెందిన సిద్దేశ్వర అనే టీడీపీ నాయకుడు 48 కర్ణాటక మద్యం బాటిళ్లను తరలిస్తుండగా వాహన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు.  
రాయదుర్గంలో టీడీపీ నేత తిప్పేస్వామి కర్ణాటక మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తుండడంతో ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు.
కాశీపురం, కెంచానపల్లి గ్రామ çపరిసర ప్రాంతాలలో నాటుసారా తయారు చేస్తూ పట్టుబడిన టీడీపీ నాయకులు చాలామంది ఉన్నారు.  
ఇటీవల రాయంపల్లిలో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్న టీడీపీ నాయకులు కరిబసవ, ఈరగిడ్డప్పలపై కేసులు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement