నవదంపతుల ఆత్మహత్య | Suicide Of New Couples | Sakshi
Sakshi News home page

నవదంపతుల ఆత్మహత్య

Jun 16 2019 11:54 AM | Updated on Jun 16 2019 12:25 PM

Suicide Of New Couples - Sakshi

బుర్రా సంతోష్‌ (ఫైల్‌) అర్చన (ఫైల్‌)

సాక్షి, బంజారాహిల్స్‌: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువజంట మనస్పర్దల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బుర్రా సంతోష్‌(28) బంజారాహిల్స్‌ రోడ్‌నెం–2లోని ఎయిర్‌టెల్‌ షోరూంలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో ఓ సెల్‌ఫోన్‌ షోరూంలో పనిచేస్తున్న అర్చన(28)తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. ఇద్దరూ మూడు నెలల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి సంతోష్‌ తల్లిదండ్రులు హాజరుకాగా అర్చన తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు ఎవ్వరూ రాలేదు.

పెళ్లి తరువాత ఇద్దరూ కలిసి బంజారాహిల్స్‌ రోడ్‌నెం–12లోని శ్రీరాంనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. గత రెండు వారాల నుంచి ఇద్దరూ తరచూ గొడవలు పడుతున్నారు. అభిప్రాయ బేధాలు తీవ్రరూపం దాల్చి శనివారం ఉదయం పోట్లాడుకున్నారు. ఉదయం 8 నుంచి 10గంటల దాకా ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఇద్దరూ క్షణికావేశంలో ఒకే తాడుతో ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సంతోష్‌ షోరూంకు వెళ్లి స్టోర్‌ తెరవాల్సి ఉంటుంది. ఎంతకూ రాకపోయే సరికి సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ అబీబ్‌ నాలుౖగైదు సార్లు ఫోన్‌ చేసినా ఎత్తలేదు. రెండు రోజుల క్రితం అర్చన కూడా ఓ షోరూంలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది.

ఆమె కూడా 10.30కు స్టోర్స్‌కు వెళ్లి తాళాలు తీయాల్సి ఉంటుంది. ఆ స్టోర్‌ మేనేజర్‌ ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా ఎత్తకపోవడంతో ఆమె భర్త పనిచేస్తున్న ఎయిర్‌టెల్‌ షోరూంకు వచ్చారు. సంతోష్‌ కూడా ఫోన్‌ లిప్ట్‌ చేయడం లేదని తెలుసుకున్న అబీబ్‌ 12గంటల ప్రాంతో సంతోష్‌ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు ఎంతకూ తలుపు తీయలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. కిటికీ తొలగించి చూడగా బెడ్‌రూంలో యువజంట ఫ్యాన్‌కు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. ఇద్దరూ ఒంటరివారవడం, సంసారంలో గొడవలు ఇవన్నీ తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.కలింగరావు, ఎస్‌ఐ హరీష్‌రెడ్డి  ఆధారాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement