
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ హైమరావు
సంతమాగులూరు: ఇటీవల సజ్జాపురంలో హత్యకు గురైన ఇల్లూరి శ్రీనివాసరెడ్డిది ఫాక్షన్ హత్య కాదని, కేవలం ఇంటి స్థలం విషయంలో జరిగిన వివాదం నేపథ్యంలోనే హత్య జరిగిందని అద్దంకి సీఐ హైమారావు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తేళ్లప్రోలు రామయ్య, పావులూరి శివన్నారాయణ మధ్య కొన్ని నెలల నుంచి ఇంటి స్థలం వివాదం ఉంది. సమస్య కోర్డులో ఉండటంతో ఇరు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. నెల కిందట ఘర్షణ జరిగినప్పుడు ఎస్‌ఐ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాలకు సర్దిచెప్పి వచ్చారు.
ఈ నెల 7వ తేదీన తేలప్రోలు రామయ్య తన ఇంటికి కప్పు వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. సమస్యను పరిష్కరించేందుకు సంతమాగులూరుకు చెందిన ఇల్లూరి శ్రీనివాసడడ్డిని పెద్ద మనిషిగా పిలిపించుకున్నాడు. రాజీ చేసేందుకు ప్రయత్నించేందుకు వెళ్లిన శ్రీనివాసరెడ్డిపై ప్రత్యర్థి వర్గం దాడికి పాల్పడింది. పావులూరి శివన్నారాయణ గడ్డపారతో తలపై తీవ్రంగా గాయపరిచాడు. పక్కనే ఉన్న దూళ్లిపాళ్ల పూర్ణచంద్రరావు, తేల్లప్రోలు రామకృష్ణ, శ్రీనివాసరావులు మంచపు పట్టెతో తలపై కొట్టారు. గొడవ జరుగుతుందని తెలుసుకున్న శివనారాయణ వర్గానికి చెందిన మరో ఆరుగురు రాళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో దాడికి పాల్పడిన వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరెడ్డిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేదు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్య కేసులో నిందితులు పది మందిని కొప్పెరపాడు బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్డుకు హాజరు పరిచినట్లు సీఐ వివరించారు. ఆయన వెంట అద్దంకి ఎస్‌ఐ సుబ్బరాజు, సంతమాగులూరు ఎస్‌ఐ నాగరాజు ఉన్నారు.