నెత్తుటి మరకలు | special story on accidents in divider | Sakshi
Sakshi News home page

నెత్తుటి మరకలు

Feb 22 2018 12:29 PM | Updated on Aug 30 2018 4:20 PM

special story on accidents in divider - Sakshi

పాలెం వద్ద జరిగిన దుర్ఘటనలో దగ్ధమైన బస్సు (ఫైల్‌)

మహబూబ్‌నగర్‌ క్రైం: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రయాణంలో కాలహరణను తగ్గించేందుకు జాతీయ రహదారులను నిర్మిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 185 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 44వ నంబరు జాతీయ రహదారి నిత్య ప్రమాదాలకు నిలయమైంది. ఈ రహదారిపై కనీసం కొన్ని జంక్షన్లలో కనీసం వెలుగునిచ్చే విద్యుత్‌ లైట్లు లేకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మిగిలింది. మరికొన్ని చోట్ల సాంకేతిక లోపాలు, ఇతరత్రా కారణాలతో ప్రమాదాలకు సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతుంది. వేగం కన్నా.. ప్రాణం మిన్న..రహదారి భద్రతలో ప్రధాన సూత్రమిది.. ప్రచారానికి బాగానే ఉన్నా.. పట్టించుకునేవారే కరువయ్యారు.  

కనిపించని స్పీడ్‌ గన్స్‌..
రహదారులపై పరిమితికి మించి వేగంగా వెళ్లిన వాహనాలను గుర్తించి జరిమానా విధించేందుకు వీలుగా స్పీడ్‌గన్స్‌ ప్రవేశపెట్టారు. గంటకు 240 కి.మీ. వేగంతో వెళ్తున్న వాహనాన్ని వీటితో గుర్తించవచ్చు. వేగంతో వస్తున్న వాహనాలను 100 మీటర్లలోకి వచ్చిన తర్వాత స్పీడ్‌గన్‌లో ఆపరేటర్‌ చూస్తే వాహనం, నంబర్, ఫొటో వేగం నమోదు అవుతుంది. ఇలాంటి సదుపాయం ఉన్న స్పీడ్‌ జాతీయ రహదారిపై ఏర్పాటు చేయడం లేదు. దీనికితోడు రోడ్డుపై ఏర్పాటు చేసిన డివైడర్ల ఎత్తు తగ్గిపోవడంతో అవతలి వైపు నుంచి వచ్చే వాహనాల ఇవతలి రోడ్డుపైకి దూసుకువచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయి.

ఘటనలు ఇలా..
జనవరి 28, 2015న అడ్డాకుల మండలం కొమిరెడ్డిపల్లి దగ్గర జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 7మంది మృతిచెందారు.
జూన్‌ 14, 2015న ఫరూఖ్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి దగ్గర జరిగిన కారు ప్రమాదంలో 5మంది మృతిచెందారు.
ఫిబ్రవరి 7, 2016న బాలానగర్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మంది మృత్యువాతపడ్డారు.
ఫిబ్రవరి 18, 2016న భూత్పూర్‌ దగ్గర జరిగిన ప్రమాదంలో కర్నూలుకు చెందిన 5మంది మృతిచెందారు.
జూన్‌ 25, 2016న అడ్డాకుల మండలం కొమిరెడ్డిపల్లి దగ్గర కారు కల్వర్టు ఢీకొనడంతో నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
జూలై 26, 2016న మానవపాడు స్టేజీ దగ్గర లారీ ఆటోను ఢీకొనడంతో  కర్నూలు పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన 5 మంది మృతిచెందారు.
డిసెంబర్‌ 19, 2016న అడ్డాకుల దగ్గర మోపెడ్‌పై వెళ్తున్న భార్యాభర్తలను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఇద్దరూ దుర్మరణం చెందారు.
నవంబర్‌ 19, 2016న కొత్తకోట మండలం అమడబాకుల స్టేజీ దగ్గర స్కార్పియో బోల్తాపడి 5మంది తాపీ కార్మికులు అనంతవాయువులో కలిసిపోయారు.
మార్చి 26, 2016న భూత్పూర్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతిచెందారు.
నవంబర్‌ 12, 2017న జడ్చర్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోను లారీ ఢీకొట్టడంతో జడ్చర్ల మండలం బండమీదిపల్లికి చెందిన నలుగురు కూలీలు మృతిచెందారు.
ఇక ఒకరిద్దరు చనిపోయినవి, క్షతగాత్రులకు సంబంధించి లెక్కకు మించి ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement