హీరోయిన్‌ మృతి కేసు ; ‘అబార్షన్‌ వికటించింది’

Sooraj Pancholi charged with abetment in Jiah Khan death case - Sakshi

యువ హీరో సూరజ్‌ పాంచోలీకి షాక్‌

జియా ఖాన్‌ కేసులో నిందితుడిగా గుర్తించిన కోర్టు

ముం‍బై : సంచలనం రేపిన హీరోయిన్‌ జియా ఖాన్‌ మృతికేసులో కీలక పరిణామం. యువ హీరో సూరజ్‌ పాంచోలీ ముమ్మాటికీ నిందితుడేనని ముంబై సెషన్స్‌ కోర్టు స్పష్టం చేసింది. ‘అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్(ఆత్మహత్యకు ప్రేరేపించడం)’  కింద సూరజ్‌ను విచారించనుంది. నేరం నిరూపణ అయితే అతనికి గరిష్టంగా 10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశంఉంది. ఫిబ్రవరి 14 నుంచి సూరజ్‌పై విచారణ జరుగనుంది. జియా మృతిపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జియా-సూరజ్‌లు సహజీవనం చేయడం, ఆ క్రమంలో ఆమె గర్భందాల్చడం, బలవంతంగా చేయించిన అబార్షన్‌ వికటించడం.. తదితర విషయాలను చార్జిషీట్‌లో పూసగుచ్చినట్లు వివరించారు.

‘సగం పిండం ఆమె కడుపులోనే ఉండిపోయింది.. ’: : సీబీఐ సమర్పించిన ఆధారాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కీలకంగా మారింది. జియా నాలుగు నెలల గర్భాన్ని సూరజ్‌ బలవంతంగా తొలగించినట్లు నిర్ధారణ అయింది. ‘ఓ రోజు సూరజ్‌ పాంచోలీ.. డాక్టర్‌కు ఫోన్‌ చేసి.. జియా పిల్స్‌ వేసుకుందని, అయితే, ఆబార్షన్‌ పూర్తిగా జరగలేదు..సగం చెత్త(స్టఫ్‌) ఆమె కడుపులోనే ఉండిపోయింద’ ని అన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత వారు ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకున్నారు. జియా తన సూసైడ్‌ నోట్‌లోనూ అబార్షన్‌ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం గమనార్హం. ‘‘నన్ను నీకు పూర్తిగా సమర్పించుకున్నాను. కానీ నువ్వు అనుక్షణం నన్ను బాధపెట్టావు, నా అణువణువుణూ నాశనం చేశావు. నాలో పెరుగుతున్న నీ బిడ్డను చంపుకోవాల్సి వచ్చినప్పుడు ఎంత క్షోభపడ్డానో నీకు అర్థంకాదు’’ అని జియా రాసుకున్నారు.

అసలేం జరిగింది? : అమితాబ్‌-రాంగోపాల్‌ వర్మల ‘నిశబ్ధ్‌’తో బాలీవుడ్‌కు పరిచయమై, ‘గజిని’, ‘హౌస్‌ఫుల్‌’ సినిమాలతో మెప్పించిన జియా ఖాన్‌.. 2013, జూన్‌ 3న జుహూలోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయారు. అయితే, తన కూతురిది ఆత్మహత్య కాదు.. సూరజ్‌ పాంచోలీనే చంపేశాడని జియా తల్లి రుబియా ఆరోపించారు. కేసు నమోదుచేసుకున్న ముంబై పోలీసులు.. జియా బాయ్‌ఫ్రెండ్‌ సూరజ్‌ పాంచోలీని కూడా ప్రశ్నించారు. చివరికి అది ఆత్మహత్యేనని చార్జిషీటును సిద్ధం చేశారు. అయితే, పోలీసుల దర్యాప్తుపై రుబియా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు సీబీఐకి బదిలీ అయింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన సీబీఐ.. జియాది ఆత్మహత్య అంటూనే.. అందుకు ప్రేరేపించింది మాత్రం సూరజ్‌ పాంచోలీనే అని తేల్చిచెప్పింది. ఇందుకుగానూ పలు ఆధారాలను సమర్పించింది. సూరజ్‌తో సహజీవనం చేసిన జియా.. అతని దుస్తులు ఉతకడం, ఇస్త్రీ చేయడం, వంటచేసి పెట్టడం, ఇల్లు తుడవటం.. ఇలా అన్ని పనులు చేసేదని సీబీఐ పేర్కొంది.

న్యాయం బతికే ఉంది.. : సూరజ్‌ పాంచోలీ నిందితుడేనని కోర్టు పేర్కొనడంపై జియా ఖాన్‌ తల్లి రుబియా హర్షం వ్యక్తం చేశారు. ‘‘నాలుగేళ్ల పోరాటం ఫలించింది. ఈ దేశంలో న్యాయం ఇంకా బతికే ఉంది. ఆత్మహత్యకు ప్రేరింపించాడు అనే కంటే ఆ దుర్మార్గుణ్ణి(సూరజ్‌ను) హంతకుడిగా గుర్తించి ఉంటే ఇంకా సంతోషించేదానిని. అదే డిమాండ్‌తో హైకోర్టుకు వెళతా’’ అని రుబియా వ్యాఖ్యానించారు.

తల్లి రుబియా ఖాన్‌, జియా మృతదేహం ఫొటోలు(ఫైల్‌)

జియా ఖాన్‌( ఫైల్‌ ఫొటో)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top