సెల్ఫీ సరదా ప్రాణాలు తీసింది 

A software engineer who recklessly drove the car with Intoxicated alcohol - Sakshi

ఫ్లైఓవర్‌పై సెల్ఫీ దిగుతున్న ఇద్దరు యువకులను ఢీ కొట్టిన కారు 

పైనుంచి కిందపడటంతో  అక్కడికక్కడే మృతి 

మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ 

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘటన  

గచ్చిబౌలి: కొత్తగా ప్రారంభించిన ఫ్లైఓవర్‌పై సెల్ఫీ తీసుకోవాలన్న సరదా కోరిక ఆ యువకులిద్దరి నిండు ప్రాణాల్ని బలిగొంది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సెల్ఫీ దిగుతోన్న యువకులిద్దరినీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రాయదుర్గం పోలీసుస్టేషన్‌ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఈ  ఘటన జరిగింది. సరూర్‌నగర్‌ భగత్‌సింగ్‌నగర్‌లో నివాసం ఉంటూ వొడాఫోన్‌ సిమ్‌ కార్డుల సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోన్న వరంగల్‌ జిల్లా చేర్యాల్‌కు చెందిన పి.సాయి వంశీ రాజు(22), సరూర్‌నగర్‌లోనే సోదరుని వద్ద నివాసం ఉంటూ పెళ్లిళ్లకు ఫొటో ఈవెంట్లు చేస్తోన్న నారాయణ్‌ పేట్‌ జిల్లా కిష్టాపూర్‌కు చెందిన ఎన్‌.ప్రవీణ్‌(22) స్నేహితులు. వీరిద్దరూ శనివారం సాయంత్రం గచ్చిబౌలి, మాదాపూర్‌ ప్రాం తాలను చూసేందుకు యాక్టివాపై సరూర్‌నగర్‌ నుంచి బయల్దేరి వెళా ్లరు. బయోడైవర్సిటీ జంక్షన్‌లో ఇటీవలే ప్రారంభమైన ఫ్లైఓవర్‌ పైకి ఎక్కి రాయదుర్గం వైపు వెళ్లారు. జంక్షన్‌లో ఫ్లైఓవర్‌పై ఉన్న మూల మలుపు వద్ద స్కూటీని పార్క్‌ చేసి సెల్ఫీ దిగుతున్నారు.

అదేసమయంలో కూకట్‌పల్లి వైపు వెళ్తున్న ఐ20 కారు(టీఎస్‌08 ఎఫ్‌వై1069) వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో ఫ్లైఓవర్‌పై నుంచి ఎగిరి కింది రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కాగ్నిజెంట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే కూకట్‌పల్లినివాసి అభిలాష్‌ డ్రైవింగ్‌ చేస్తుండగా... కారులో అతని స్నేహితులు అనిల్, చంద్రకాంత్, సూర్య ఉన్నారు. వీరందరూ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదానికి ముందే ఫ్లైఓవర్‌పై టైరు పంక్చర్‌ కావడంతో ఓ ద్విచక్రవాహనాన్ని తోసుకుంటూ వెళ్తోన్న పాడాల మురళి కృష్ణ(30), గిరిధర్‌ సుభాష్‌(26)లను, తర్వాత హీరోహోండాపై వెళ్తోన్న చుంచు సాయి కృష్ణ(21), చుంచు పవన్‌ కుమార్‌(19)లను ఢీకొట్టగా వీరంతా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లైఓవర్‌పై ఉన్న మూలమలుపు ఎక్కువగా ఉండటం, మద్యం మత్తులో కారు నడపడం ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది. అభిలాష్‌ను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరి గిన వెంటనే కారులో ఉన్న అభిలాష్‌ స్నేహితులు అనిల్,చంద్రకాంత్, సూర్య ఘటనా స్థలి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top