రైతన్నపై పాము పడగ     

Snake Bites Killing People - Sakshi

వానాకాలంలో పెరిగిన విషసర్పాల సంచారం

రెండేళ్లలో  25 మంది పాముకాటు బాధితులు

వారం రోజుల్లోనే నలుగురి మృత్యువాత

ఎక్కువ మంది రైతులే మూఢవిశ్వాసాలతోనే బాధితుల మృతి

మెదక్‌జోన్‌ : వర్షాకాలం సీజన్‌ ప్రారంభం అయ్యిందో లేదో పాములు బుసలు కొడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో జిల్లాలో పాము కాటుకు గురై నలుగురు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ స్నేక్‌ వీనమ్‌లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయినా పాముకాటు బాధితులకు చివరి నిమిషంలో చికిత్స అందడం లేదు. వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకురాకపోవడం, మూఢనమ్మకాలతో మంత్రాలు వేయిస్తూ కాలయాపన చేస్తుండటం వంటివి ప్రాణాల మీదికి తెస్తున్నాయి.

పాముకాటు గురైనప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే పాముల బారిన పడకుండా రక్షించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. గడిచిన రెండు సంవత్సారాల్లో  25 మంది పాముకాటు బారిన పడ్డారు. సకాలంలో చికిత్సలు అందక 11 మంది మృత్యువాత పడ్డారు.  పాముకాటు వేసిన 3 గంటల్లో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు చెబుతున్నారు. అంతకు మించితే  విషం శరీరం అంతాపాకి.. మృతి చెందే అవకాశం ఉంటుంది.

పాముకాటుకు గురై మృతిచెందిన వారిలో అత్యధికంగా రైతులే ఉన్నారు. రాత్రిపగలు తేడాలేకుండా రైతులు పొలం గట్లవెంట తిరుగుతుంటారు. ఈ క్రమంలో అనుకోకుండా పాము కాటుకు గురవుతున్నారు. రాత్రివేళల్లో టార్చిలైట్, చేతికర్రతో పాటు బూట్ల మాదిరిగా చెప్పులు వేసుకోవడంతో పాములు, తేళ్లు కాటు వేసినా పెద్దగా ప్రమాదం ఉండదు. పాముకాటు బాధితులు భయంతోనే ఎక్కువగా మృతి చెందే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

కాటువేసిన సమయంలో భయాందోళనకు గురికావడంతో గుండె పనిచేయటం మానేసి మృతి చెందే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.   పాము కాటువేస్తే వెంటనే  కాటు వేసిన చోట గుండె వైపున తాడుతో కట్టుకట్టాలి. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి దాన్ని వదలు చేసుకుంటూ సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అలాగే పాము కాటువేసినప్పడు అది విషసర్పమా కాదా...? తెలుసుకోవడానికి రెండు లేదా ఒకటి మాత్రమే గాటు ఉంటే విషసర్పమని గుర్తించాలి.

అంతేకాకుండా గాటులోంచి రక్తం కారుతుంది. పాము కాటు వేయగానే ఎలాంటి భయాందోళనకు గురికాకుండా పైభాగంలో కట్టుకట్టి సిరంజిని గాటులో పెట్టి రక్తాన్ని పీల్చాలి. ఇలా ఒక్కోగాటులో రెండు, లేక మూడు సార్లు అలాపీల్చితే విషం బయటకు  పోతుంది. విషపాము కాటువేస్తె రక్తం కూడా నల్లగా బయటకు వస్తుంది. దేశంలో 270 రకాల పాములు ఉండగా అందులో 56 సర్పాలకు మాత్రమే విషం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

 మన రాష్ట్రంలో కేవలం 5 పాములకు మాత్రమే ఉంటుందంటున్నారు. వాటిలో ముఖ్యంగా  నాగు(త్రాచు) పాము, నల్ల కట్లపాము, రక్తపెంజరతో పాటు మరో రెండు రకాల పాములు ఉన్నట్లు చెబుతున్నారు. 

మూఢనమ్మకాలతో అధిక నష్టం

ఆస్పత్రికి తరలించకుండా మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. మంత్రాలు వేయిస్తూ ఆలస్యం చేయటంతో విషం శరీరం అంతా పాకి చనిపోతున్నారు. విష సర్పం కాటు వేస్తే మంత్రాలకు ఎట్టిపరిస్థితిలో విషం ఎక్కకుండా ఉండదు.   ఒకవేళ పాముకాటు వేసిన వ్యక్తికి మంత్రాలు వేయటంతో విషం ఎక్కలేదు అంటే కాటువేసిన పాముకు విషంలేదని అర్థం. కానీ మంత్రాలు వేయటంతోనే విషం ఎక్కలేదు అంటే అది మూఢనమ్మకమనే చెప్పాలి.

జిల్లాలో 5 సంవత్సరాలకు ముందు పాముకాటు వేస్తే దుబ్బాక ఐరేళ్ల లక్ష్మయ్య పేరుచెప్పి  పాముకాటు  బాధితుడి ఒంటిమీద ఉన్న దుస్తులను ముడివేసేవారు. అతని పేరుచెప్పి ముడివేస్తే విషం ఎక్కదని అప్పట్లో ఉమ్మడి జిల్లా ప్రజలకు గట్టినమ్మ కం. ఆదివారం వరకు ఆగి దుబ్బాకకు వెళ్లి అతని సమక్ష్యంలో ఆ ముడిని విప్పేవారు.  వీరిలోనూ అనేకులు చనిపోయినట్లు సమాచారం. లక్ష్మయ్య  మరణించటంతో  ఆ  పక్రియ నిలిచిపోయింది. అయినప్పటికీ నేటికి అనేక గ్రామాల్లో అలాంటి  మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి.

సకాలంలో ఆస్పత్రికి తీసుకురావాలి..

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటు మందులు అందుబాటులో ఉన్నాయి.  పాముకాటు వేసిన 3 గంటల్లోపల బాధితుడిని  ఆస్పత్రికి తరలించాలి.  మంత్రాలు వేయిస్తే ఎట్టిపరిస్థితుల్లో విషం తగ్గదు. అది పూర్తిగా మూఢ విశ్వాసం.  పాముకాటు బాధితులు చనిపోయారంటే సకాలంలో ఆస్పత్రికి తీసుక రాకుండా మంత్రాలు వేయించి ఆలస్యం చేయటంతోనే జరిగి ఉంటుంది. - వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ

ఇటీవల మృతి చెందిన వారు

  • హవేళిఘణాపూర్‌ మండలం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన హన్మంతు ఈనెల 13న,  పొలం వద్ద పాముకాటుకు గురై మృతి చెందాడు.
  • హవేళిఘణాపూర్‌ మండలం లింగ్సాన్‌పల్లి గిరిజన తండాకు చెందిని లంబాడి చత్రియ ఈనెల 13న,  పొలం వద్ద పాముకాటుకు గురై మృతి చెందాడు.
  • కౌడిపల్లి మండలం బుజరంపేట పంచాయతీ పరిధిలోని వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన హాస్యప్రియ(10) ఈనెల 12, ఇంటివద్ద పాముకాటుకు గురై మృతి చెందింది.
  • పాపాన్నపేట మండల కేంద్రానికి చెందిన హరిప్రసాద్‌(5)  ఈనెల 12న, రాత్రివేళలో పాముకాటుకు గురై మృతి చెందాడు.  
     
Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top