అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి

SK  Joshi Video Conference Meeting In Warangal - Sakshi

వరంగల్‌ రూరల్‌ : ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పెండింగ్‌ అట్రాసిటీ కేసులపై జూన్‌ 6 లోగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌కే.జోషి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలతో అట్రాసిటీ కేసులు, రైతు బంధు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవంపై వీడియో కాన్ఫరెన్స్‌  నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఈ కేసులను ప్రత్యేకంగా సమీక్షిస్తోందని, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అట్రాసిటీ కేసులపై ప్రత్యేకంగా సమీక్షించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించడంతోపాటు బాధితులకు వెంటనే నష్టపరిహారం అందేలా చూడాలని అన్నారు. కేసులపై జిల్లా స్థాయిలో విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించి, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు.

అట్రాసిటీ  కేసులు నమోదనప్పుడు కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యక్షంగా పర్యటించాలని, ఈ కేసుల నష్ట పరిహారం చెల్లింపులు ట్రెజరీ కంట్రోల్స్‌లో లేవని తెలిపారు. బాధితుల అకౌంట్‌ నంబర్లను కలెక్టర్‌కు ఇవ్వాలని, లేకుంటే తహసీల్దారు ద్వారా వివరాలు సేకరించాలని పేర్కొన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిందని, బాధితులకు పరిహారం చెల్లింపులు చèట్ట ప్రకారం జరగాలని ఆదేశించిందన్నారు. ఎస్పీలు ఈకేసులపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఆన్‌లైన్‌ ద్వారా మానిటరింగ్‌ చేయాలని, ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే నమోదు చేసి, జిల్లా కలెక్టర్లకు కేసుల వివరాలు పంపాలన్నారు.

రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 41,09,743 మందికి పాస్‌ పుస్తకాలు పంపిణీ చేశామని, ధరణి వెబ్‌సైట్‌లో ఆధార్‌ సీడింగ్, డబుల్‌ ఖాతా, బ్యాక్‌ లాగ్‌ సక్సెస్‌ కరెక్షన్‌ మాడ్యూళ్లను సిద్ధం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాల వారీగా పనితీరును ప్రతి రోజు సమీక్షిస్తున్నారని, జూన్‌ 20లోగా మిగిలిన పాస్‌ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బంధుకు సంబంధించిన 45.13 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.ఆర్‌ఓఎఫ్‌ఆర్‌కు సంబంధించి 47 వేల చెక్కులు పంపిణీ చేశామని వ్యవసాయశాఖ కమిషనర్‌ జగన్‌ మోహన్‌ తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లాలలో ఘనంగా నిర్వహించటానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌ సిన్హా జిల్లా కలెక్టర్లను కోరారు. ఇందుకోసం మార్గదర్శకాలను జారీ చేసినట్టు ఆయన వివరించారు.

 
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో  వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి బుద్ద ప్రకాష్‌జ్యోతి మట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీని  వేగవంతం  చేయాలని పేర్కొన్నారు. ఆర్డీఓలు జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రాలపై కలెక్టర్లు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాలన్నారు. కలెక్టర్‌ ముండ్రాతి హరిత మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 12 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు 6,49,250 రూపాయలను చెల్లించామని అన్నారు. బడ్జెట్‌ లేనందున 18 కేసులకు ఇంకా చెల్లించలేదని, 11 కేసులకు సంబంధించి బ్యాంకు వివరాలు సరిగ్గా లేవని, 6 కేసులకు క్లారిఫికేషన్‌ కోసం ప్రభుత్వానికి రాశామని తెలిపారు. గత  సంవత్సరం మాదిరిగానే  ఈ సారి కూడా రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు.  డీఆర్వో భూక్యా హరిసింగ్, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top