నకిలీ నగలు తాకట్టు

Sisters Arrest in Fake Gold Hostage in Tamil nadu - Sakshi

అక్కాచెల్లెలు అరెస్టు  

తిరువళ్లూరు: కుదువ దుకాణంలో నకిలీ నగలను తాకట్టుపెట్టి 50 వేల రూపాయలతో ఉడాయించిన అక్కాచెల్లిని అరంబాక్కం పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం సమీపంలోని ఎలావూర్‌ బజారువీధిలో బాలాజీ జ్యువెలరీ షాపు వుంది. ఇక్కడ నగలను కుదువ పెట్టుకునే వ్యాపారం సైతం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 6వ తేదీన ఇద్దరు మహిళలు వచ్చి వారి వద్ద వున్న నగలను రూ.50 వేలకు కుదువ పెట్టి నగదు తీసుకున్నట్టు తెలిసింది. అయితే మహిళలు కుదువు పెట్టిన నగలపై అనుమానం రావడంతో దుకాణ యజమాని సంబంధిత నగలను పరిశీలించగా అవి నకిలీవని తేలాయి. దీంతో షాపు యజమాని బాబులాల్‌ ఆరంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల్లో వున్న నిందితుల ఫొటోను  సమీపంలోని అన్ని నగల దుకాణంలో వుంచి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ నేపథ్యంలో గురువారం అదే ప్రాంతంలో జగదాంబ నగల దుకాణానికి వెళ్లిన ఇద్దరు మహిళలు నకిలీ నగలను కుదువు పెట్టుకుని నగదును ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన కుదువ వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన  సంఘటన స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో ఇద్దరు మహిళలు కొత్తగుమ్మిడిపూండికి చెందిన అక్క ప్రియదర్శిని, చెల్లి జననీగా గుర్తించారు. వీరు గతంలో ఇదే విధంగా నకిలీ నగలను కుదువ పెట్టి పలు మోసాలకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top