ఆర్టీసీ డ్రైవర్‌పై ఎస్‌ఐ దాడి

SI Attack On RTC Bus Driver In Kurnool - Sakshi

హైవేపై బైఠాయించిన డ్రైవర్లు

ఎస్పీకి ఫిర్యాదు   

ఓర్వకల్లు: సీఎం సభకు ప్రజలను తరలిస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఓ ఎస్‌ఐ దాడికి పాల్పడిన ఘటన గురువారం ఓర్వకల్లులో చోటుచేసుకొంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు బనగానపల్లె డిపోకు చెందిన   బస్సు(ఏపీ02జెడ్‌–269)లో  డ్రైవర్‌ బాబు పాణ్యం మండలం గోనవరం, భూపనపాడు గ్రామాల ప్రజలను ఓర్వకల్లు సభకు తీసుకొచ్చాడు. ప్రజలు దిగిపోయాక బస్సును పార్కింగ్‌ చేసే క్రమంలో పోలీసులు డ్రైవర్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో సహనం కోల్పోయిన డ్రైవర్‌ మీరు చెప్పినట్లుగానే పార్కింగ్‌ చేస్తున్నానని చెప్పాడు.

అక్కడే విధులు నిర్వహిస్తున్న బండిఆత్మకూరు ఎస్‌ఐ విష్ణునారాయణ ఆగ్రహంతో డ్రైవర్‌ పై చేయి చేసుకోవడమేగాక దుర్భాషలాడాడని డ్రైవర్‌ బాబు వాపోయాడు.  తోటి డ్రైవర్‌ కంబగిరి అక్కడికి చేరుకొని ఘటనపై పోలీసులను ప్రశ్నించాడు. ఈ క్రమంలో పోలీసులకు డ్రైవర్ల మధ్య వాగ్వాదం జరిగింది. విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా సదరు ఎస్‌ఐ సభ ముగిశాక మీ సంగతి చూస్తానని బెదిరించడంతో డ్రైవర్లు హైవేపై  ఆందోళనకు దిగారు.  ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ, నంద్యాల డీఎస్పీకి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు çహామీ నివ్వడంతో డ్రైవర్లు ఆందోళన విరమించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top