ఏసీబీ వలలో బొల్లారం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ | SI And Police Constable Arrest in Bribery Demand | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో బొల్లారం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

Jun 18 2019 8:38 AM | Updated on Jun 18 2019 8:38 AM

SI And Police Constable Arrest in Bribery Demand - Sakshi

ఏసీబీ అదుపులో ఎస్సై బ్రహ్మచారి, కానిస్టేబుల్‌ నగేష్‌

తిరుమలగిరి: ఓ కేసులో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం తీసుకున్న బొల్లారం ఎస్సై బ్రహ్మచారి, కానిస్టేబుల్‌ నగేష్‌లను సోమవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ హైదరాబాద్‌ రేంజ్‌–2 డీఎస్పీ అచ్చేశ్వర్‌ రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బొల్లారం, ఆదర్శనగర్‌కు  చెందిన నర్సింగ్‌రావు బ్యాండ్‌మేళం నిర్వహించేవాడు. గతంలో అతడి వద్ద పనిచేసే వర్గల్‌కు చెందిన గోపి అనే వ్యక్తి ఏడాది క్రితం రూ.18 వేలు అడ్వాన్స్‌గా తీసుకుని పనిలోకి రావడం లేదు. ఈ నెల 2న అతను రోడ్డుపై కనిపించడంతో నర్సింగ్‌ రావు పనికి ఎందుకు రావడం లేదని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో నర్సింగ్‌రావు అతడిపై చేయిచేసుకున్నాడు. దీంతో గోపి ఈ నెల 3న బొల్లారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం అతడిని స్టేషన్‌కు పిలిచినా రాకుండా ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేశాడు.

ఈ నేపథ్యంలో కానిస్టేబుల్‌ నగేష్‌ ద్వారా ఎస్సై బ్రహ్మచారితో సంప్రదింపులు జరపగా ఎస్‌ఐ రూ. 20వేలు  డిమాండ్‌ చేశాడు. ఈ నెల 13న కానిస్టేబుల్‌ నగేష్‌కు నర్సింగ్‌ రావు భార్య అంబికా మొదటి విడతగా  రూ.10వేల నగదు అందజేసింది. రెండు రోజుల్లో మిగతా మొత్తాన్ని ఫోన్‌ పే ద్వారా చెల్లించాలని సూచిస్తూ వాట్సాప్‌లో అకౌంట్‌ నంబర్‌ పంపాడు. దీంతో ఆమె రూ.10వేలు బదిలీ చేసింది. అనంతరం కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేసి ఈ విషయాన్ని ఎస్సైకి చెప్పాలని కోరగా,  నగేష్, ఎస్సైతో కాన్ఫరెన్స్‌ కాల్‌ ఏర్పాటు చేయడంతో ఆమె నేరుగా ఈ విషయాన్ని ఎస్‌ఐ బ్రహ్మాచారికి చెప్పింది. అయితే డబ్బులు తీసుకున్నా బెయిల్‌ ఇవ్వకపోగా టీఆర్‌ఎస్‌ నేత వేణుగోపాల్‌రెడ్డిని తీసుకుని స్టేషన్‌కు రావాలని ఎస్సై సూచించాడు. దీనికితోడు మరోసారి అతడి ఇంటికి వచ్చిన కానిస్టేబుల్‌ నాగేష్‌ రూ.5వేలు  డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు  సీసీ కెమెరా పుటేజీతో పాటు ఫోన్‌లోని వాట్సాప్, ఆడియోల ఆధారంగా సోమవారం బొల్లారం పోలీస్‌ స్టేషన్‌లో  ఎస్సై బ్రహ్మాచారి, కానిస్టేబుల్‌ నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

రాజకీయ కక్షతోనే కేసు ...
రాజకీయంగా కక్షతోనే తన భర్తపై ఎస్సై కేసు నమోదు చేశారని నర్సింగ్‌రావు భార్య అంబిక ఆరోపించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చినందునే తమపై అక్రమంగా కేసు బనాయించారని పేర్కొంది. ఫిర్యాదుదారుడు గోపి రాజీకి వచ్చినా, ఎస్సై కుట్రపూరితంగా వ్యవహరించాడని ఆరోపించింది. స్టేషన్‌ బెయిల్‌ రావాలంటే టీఆర్‌ఎస్‌ నాయకులను తీసుకుని రావాలని చెప్పడంతో తాము ఏసీబీని ఆశ్రయించినట్లు ఆమె పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement