తిరగబడ్డ ఎర్రకూలీలు

Sandle Wood Smugglers Attack On Police In Chittoor - Sakshi

ఒక రౌండ్‌ గాల్లో కాల్పులు జరిపిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులు

సాంకేతిక సాయంతో 22 దుంగల స్వాధీనం

నలుగురు స్మగ్లర్లు అదుపులోకి..

చంద్రగిరి : ఎర్రస్మగ్లర్లు తిరగబడడంతో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఒక రౌండ్‌ గాల్లో కాల్పులు జరిపిన ఘటన గురువారం తెల్లవారుజామున శేషాచల అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆర్‌ఎస్సై వాసు వివరాల మేరకు... టాస్క్‌ఫోర్స్‌ ఐజీ కాంతారావు ఆదేశాల మేరకు ఆర్‌ఎస్సై వాసు బుధవారం రాత్రి శేషాచలంలోని నాగపట్ల బీట్‌లో కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున సచ్చినోడుబండ వద్దకు చేరుకున్న అధికారులు స్మగ్లర్ల పాదముద్రలను గుర్తించారు. తమ వద్ద ఉన్న నైట్‌విజన్‌ గాగుల్స్‌తో స్మగ్లర్ల కదలికలను గుర్తించారు. అనంతరం చాకచక్యంగా వ్యవహరించి నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి, వారు తెలిపిన వివరాల మేరకు వారి వద్ద కొంత మంది సిబ్బందిని కాపలాగా ఉంచి, మరికొంత మంది అధికారులు కూంబింగ్‌ చేపట్టారు.

చెట్లపొదల్లో ఉన్న స్మగ్లర్లు తమ వారిని రక్షించాలనే ఉద్దేశంతో అధికారులపై ఒక్కసారిగా దాడులకు తెగబడ్డారు. స్మగ్లర్లను ఎంత హెచ్చరించినా వినకపోవడంతో ఆత్మరక్షణ కోసం అధికారులు ఒక రౌండ్‌ గాల్లో కాల్పులు జరిపారు. అనంతరం పారిపోయిన కూలీల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో స్మగ్లర్లు ముళ్లపొదల్లో దాచి ఉంచిన 22 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన స్మగ్లర్లను విచారించి తమిళనాడు రాష్ట్రం జావాదిమలైకు చెందినవారుగా గుర్తించారు. ఐజీ కాంతారావు, ఎస్పీ రవిశంకర్, డీఎస్పీ వెంకటరమణ పరిస్థితిని సమీక్షించి, అదనపు బలగాలను పంపి తగు సూచనలు చేశారు. అనంతరం సిబ్బందిని వారు అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top