ఏసీబీ వలలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ

RWSAE Officer Caught ACB While Demanding Bribery PSR Nellore - Sakshi

బాధితుడు నగదు ఇస్తుండగా ఏఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

నెల్లూరు(క్రైమ్‌): బిల్లులు మంజూరు చేసేందుకు ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటున్న గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఏఈని నెల్లూరు  ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల సమాచారం మేరకు.. కలిగిరి మండలం వీర్నకొల్లుకు చెందిన ఎం.తిరుపాల్‌రెడ్డి రైతు. ఆయన వ్యవసాయంతోపాటు చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంలో ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్‌ 25వ తేదీ వరకు వాటర్‌ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం నుంచి రూ.5.30 లక్షలకు వర్క్‌ఆర్డర్‌ను తిరుపాల్‌రెడ్డి పొందారు. నిర్ధేశించిన గడువు వరకు నీటిని సరఫరా చేశారు. బిల్లు మంజూరుకు గాను సంబంధిత మండలస్థాయి అధికారులను సంప్రదించగా వారు పరిశీలించి ఎంబుక్‌పై సంతకం చేసి తదుపరి చర్యల నిమిత్తం నెల్లూరు పాత జెడ్పీ భవనంలోని ఈఈ కార్యాలయానికి పంపారు.

అప్పటి నుంచి తిరుపాల్‌రెడ్డి బిల్లు మంజూరు కోసం కార్యాలయంలోని ఏఈ కె.శ్రీనివాసులు చుట్టూ తిరగసాగారు. కారణం చెప్పకుండా ఆయన తిరుపాల్‌రెడ్డిని రేపు, మాపు అంటూ తిప్పుకోసాగారు. వారం రోజుల క్రితం బిల్లులోని మొత్తానికి 2 పర్సంట్‌(రూ.10,600) లంచం ఇస్తే బిల్లు మంజూరు చేస్తామని ఏఈ డిమాండ్‌ చేశారు. ఇదే విషయాన్ని ఫోన్‌లో తెలియజేయడంతో బాధితుడు కాల్‌ రికార్డు చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు నెల్లూరు ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌డీ శాంతోకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ సూచనల మేరకు సోమవారం మధ్యాహ్నం బాధితుడు లంచం తాలూకు నగదును ఏఈ శ్రీనివాసులుకు(ఆయన కార్యాలయంలోనే) ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా çపట్టుకుని ఆయనకు రసాయన పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏఈని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారుల రాకతో ఆర్‌డబ్ల్యూఎస్‌లోని పలువురు అధికారులు కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. 

లంచం తాలూకు నగదుతో ఏఈ , బాధితుడు తిరుపాల్‌రెడ్డి
ప్రతి పనికీ పర్సంటేజ్‌  
తాజాగా ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఈ శ్రీనివాసులు ప్రతి పనికి పర్సంటేజ్‌ వసూలు చేస్తున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సమయంలో కలిగిరి మండలం పాపనముసలి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్‌ రామకృష్ణారెడ్డి ఏసీబీ అధికారులను కలిశారు. తాను ఈ ఏడాది పాపనముసలి గ్రామంలో నీరు సరఫరా చేశానని, అందుకు సంబంధించి రూ.4.90 లక్షలు బిల్లు రావాల్సి ఉండగా ఏఈని సంప్రదించడంతో 2 పర్సంట్‌ లంచం ఇవ్వాలని, లేకుంటే బిల్లుపై సంతకం పెట్టేదిలేదని బెదిరించాడని ఏఈ శ్రీనివాసులుపై డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అదేక్రమంలో వింజమూరుకు చెందిన గంగాధర్‌ అనే కాంట్రాక్టర్‌కు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు సైతం రూ.2.47 లక్షల బిల్లు మంజూరు చేయించుకునేందుకు కార్యాలయానికి వచ్చారు. వారు సైతం తమను గత కొంతకాలంగా తిప్పించుకుంటున్నారని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరి..
ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కె.శ్రీనివాసులు 1987లో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎన్‌ఎంఆర్‌)గా విధుల్లో చేరారు. 2002లో ఏఈగా పదోన్నతి పొందారు. 2018 నుంచి నెల్లూరు గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం కార్యనిర్వహక ఇంజినీరు వారి(ఈఈ) కార్యాలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు. విధులకు సైతం సరిగా హాజరుకాడని సహచర ఉద్యోగులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top