కోటి లొంగుబాటు

Rumour Monger Koti Surrenders Nampally Court - Sakshi

‘ప్రముఖుల కేసుల్లో’ నిందితుడి ఆరోపణలు

టీడీపీ నేతల ప్రోద్భలంతోనే ఆ దుష్ప్రచారం?

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, సినీనటి పూనమ్‌కౌర్‌లపై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటేశ్వరరావు అలియాస్‌ కోటి మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఇతడిపై హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో రెండు కేసులు నమోదై ఉన్నాయి. తనపై సోషల్‌ మీడియాలో తీవ్రస్థాయిలో జరిగిన దాడి వెనుక కోటి అనే వ్యక్తి ఉన్నాడని లక్ష్మీపార్వతి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ కేసు దర్యాప్తులో ఉండగానే సినీనటి పూనమ్‌కౌర్‌ కూడా తనపై గుర్తు తెలియని వ్యక్తులు అభ్యంతకరమైన పోస్టింగ్‌లు పెట్టారంటూ ఫిర్యాదు ఇచ్చారు. ఈ రెండు కేసులను సాంకేతికంగా దర్యాప్తు చేసిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు రెండు కేసుల్లోనూ కోటినే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా, లాయర్‌తో కలిసి వచ్చి లొంగిపోతానంటూ కోటి కొన్నాళ్లుగా సైబర్‌క్రైమ్‌ పోలీసులకు వర్తమానం పంపుతూ వచ్చాడు. హఠాత్తుగా మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతని రాకని పసిగట్టి సైబర్‌క్రైమ్‌ పోలీసులు కోర్టుకు చేరుకునేలోపే కోటి న్యాయస్థానంలో లొంగిపోయాడు.

చదవండి: (దురుద్దేశంతోనే నాపై దుష్ప్రచారం: లక్ష్మీ పార్వతి)

ప్రముఖులకు దగ్గరై...
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు సోషల్‌మీడియా కేంద్రంగా వైసీపీ నాయకులపై విషప్రచారం చేశారు. ఇందులో కోటిని కూడా ఉపయోగించారు. టీడీపీ నేతలు ఓ పథకం ప్రకారం వారు టార్గెట్‌ చేసిన వారి వద్దకు కోటిని పంపిస్తుంటారని సైబర్‌క్రైమ్‌ పోలీసులు భావిస్తున్నారు. వారి ‘లక్ష్యాల’తో పరిచయం, స్నేహాం ద్వారా తనపై నమ్మకం కలిగేలా ప్రవర్తించి కోటి ఆపై అసలు పని ప్రారంభిస్తాడు. అవకాశం చిక్కినప్పుడల్లా వారి ఫోన్లలో తనకు కావాల్సిన అంశాలు పొందుపరిచే వాడని, లక్ష్మీపార్వతి ఫోన్‌ను కూడా అలాగే ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు పేర్కొన్నారు.

కోటిని అదే విధంగా పూనమ్‌కౌర్‌ వద్దకు కూడా పంపిన టీడీపీ నాయకులు ఆమెతో ఏపీకి చెందిన ఓ ప్రముఖ నటుడికి వ్యతిరేకంగా మాట్లాడించి, వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేలా చేశారని భావిస్తున్నారు. ఈ రెండు కేసులకు సంబంధించిన పలు వివరాలను కోటి నుంచి రాబట్టాల్సి ఉండటంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు అతణ్ణి కస్టడీకి కోరాలని భావిస్తున్నారు. సోషల్‌ మీడియాలో కోటి కార్యకలాపాలు, కోటికి, టీడీపీ నాయకులకు ఉన్న సంబంధాల గురించి నిర్థారణ కావాలంటే అతణ్ణి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని వారు చెప్తున్నారు.  

చదవండి: సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన పూనమ్‌ కౌర్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top