మయన్మార్‌ టు హైదరాబాద్‌

Rohingyas Arrested in Hyderabad - Sakshi

వయా బంగ్లాదేశ్‌ ముగ్గురు రోహింగ్యాలకు అరదండాలు

సిటీలో శరణార్థులుగా నివసిస్తున్నట్లు నిర్ధారణ

వక్రమార్గంలో గుర్తింపు కార్డులు

మయన్మార్‌ నుంచి బంగ్లాదేశ్‌ మీదుగా భారత్‌కు వలసవచ్చి, నగరంలో శరణార్థులుగా స్థిరపడి, దేశ పౌరులుగా ప్రకటించుకొని గుర్తింపు కార్డులు పొందిన ముగ్గురు రోహింగ్యాలను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరు కొన్ని ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధిపొందినట్లు గుర్తించామని అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ బుధవారం వెల్లడించారు. మయన్మార్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పలువురు రోహింగ్యాలు భారత్‌కు వలస వస్తున్నారు. వీరిలో కొందరు శరణార్థులుగా, మరికొందరు అక్రమమార్గంలో వచ్చి చేరుతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: మయన్మార్‌ నుంచి బంగ్లాదేశ్‌ మీదుగా భారత్‌కు వలసవచ్చి, నగరంలో శరణార్థులుగా స్థిరపడి, దేశ పౌరులుగా ప్రకటించుకుని గుర్తింపుకార్డులు పొందిన ముగ్గురు రోహింగ్యాలను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరు కొన్ని ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధిపొందినట్లు గుర్తించినట్లు అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ బుధవారం వెల్లడించారు. మయన్మార్‌లోని బుథీడంగ్‌ ప్రాంతానికి చెందిన మమ్మద్‌ ఇబ్రహీం 2013లో ఆ ప్రాంతాన్ని వదిలేశాడు. రెండేళ్లు బంగ్లాదేశ్‌లో ఉన్న ఇతను 2015లో హైదరాబాద్‌ వచ్చి బహదూర్‌పురలోని ఎన్‌ఎం గూడలో ఉంటున్నాడు. 2017లో మయన్మార్‌ శరణార్థి అయిన అఖితారా బేగంను వివాహం చేసుకున్నాడు. ఇతడికి ఐక్యరాజ్య సమితి జారీ చేసిన శరిణార్థి కార్డు కూడా ఉంది.

అదేదేశానికి చెందిన నూర్‌ ఉల్‌ అలీం 2007లో తల్లి, ఐదుగురు సోదరులు,  సోదరితో హైదరాబాద్‌కు వచ్చి ఎంఎన్‌ గూడలో స్థిరపడ్డాడు. మయన్మార్‌కే చెందిన రజియా బేగంను వివాహం చేసుకున్నాడు. ఇతడికీ శరణార్థి కార్డు ఉంది. మూడో వ్యక్తి అయిన షేక్‌ అజహర్‌ కిషన్‌బాగ్‌లో ఉంటూ హైదరాబాద్‌కు చెందిన షకీనా బేగంను వివాహం చేసుకున్నాడు. 2012లో మహ్మద్‌ అజహర్‌ పేరుతో గుర్తింపుకార్డులు పొందిన అతను ఆపై 2015లో అసలు పేరుతో మరోసారి కార్డులు తీసుకున్నాడు. ఇతడికి శరణార్థి కార్డు లేకపోవడంతో భారత్‌లో అక్రమంగా నిసిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ ముగ్గురూ తాము భారతీయులుగా పేర్కొంటూ క్‌లైమ్‌ చేసుకుంటున్నారు. మహ్మద్‌ ఇబ్రహీం తన భార్యకు కేసీఆర్‌ కిట్‌ను కూడా తీసుకున్నాడు. ఈ ముగ్గురి వ్యవహారంపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.శ్రీశైలం, కేఎన్‌ ప్రసాద్‌వర్మ, వి.నరేందర్, మహ్మద్‌ త ఖ్రుద్దీన్‌ తమ బృందంతో వలపన్ని పట్టుకున్నారు. 

రోహింగ్యాల ‘ప్రయాణం’ ఇలా...
మయన్మార్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పలువురు రోహింగ్యాలు భారత్‌కు వలసవస్తున్నారు. వీరిలో కొందరు శరణార్థులుగా, మరికొందరు అక్రమమార్గంలో వచ్చి చేరుతున్నారు. ఈ ముగ్గురి విచారణలో మయన్మార్‌ నుంచి హైదరాబాద్‌ వరకు వారి ‘ప్రయాణం’, ఇక్కడగుర్తింపుకార్డులు పొందుతున్న వైనం బయటపడ్డాయి.  
మయన్మార్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన రోహింగ్యాలు అడవుల వెంట కాలినడకన ఆదేశంలోని మాంగ్డో ప్రాంతానికి చేరుకుంటున్నారు.  
ఈ మార్గంలో ఎక్కడా తమ ఉనికి పోలీసులు, సాయుధ బలగాలకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.  
దళారుల సహకారంతో మాంగ్డో నుంచి బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోని నఫ్‌ నది తీరానికి చేరుకుంటున్నారు.
రాత్రి వేళల్లో చిన్న చిన్న పడవలపై నఫ్‌ నదిని దాటుతున్న వీరిని బంగ్లాదేశ్‌లో ఉన్న దళారులు రిసీవ్‌ చేసుకుని, భద్రత బలగాల కంట పడకుండా టెక్నాఫ్‌ అనే నగరానికి తరలిస్తున్నారు.
టెక్నాఫ్‌ నుంచి బస్సుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల శరణార్థి శిబిరమైన కాక్స్‌ బజార్‌కు చేరుకుంటున్నారు. అక్కడే అనేక మందిఐక్యరాజ్య సమితి శరణార్థి కార్డు పొందుతున్నారు.
ఈ శిబిరంలో కొన్నాళ్లు తలదాచుకుంటున్న రోహింగ్యాలు  ఢాకా చేరుకుని, అక్కడ నుంచి బస్సుల్లో ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని భోమ్రా ప్రాంతానికి చేరుతున్నారు.
దళారులు వీరిని భద్రతా బలగాల కళ్ళుగప్పిఇచ్ఛామతి నదిని దాటిస్తూ భారత్‌లోకి పంపుతున్నారు.  
పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హట్‌ ప్రాంతానికి చేరుకునే వీరు అక్కడి నుంచి హౌరాకు వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు బీహార్, జమ్మూకాశ్మీర్‌లకు వీరి తాకిడి ఎక్కువగా ఉంది.
ఎక్కడికి వెళ్లినా తాము పశ్చిమ బెంగాల్‌ వాసులుగా చెప్పుకుంటూ ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు.  
అద్దె ఇంటి కరెంట్‌ బిల్లు ఆధారంగా, వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను వాడుకుంటూ ఓటర్‌ ఐడీలు పొందుతున్నారు. దీని ఆధారంగా ఆధార్, రేషన్‌కార్డు, పాస్‌పోర్ట్‌ తదితర గుర్తింపుకార్డులు తీసుకుంటున్నారు. 
ఆ తర్వాత ఇదే పాస్‌పోర్ట్‌తో ఇతర దేశాలకు వెళుతున్నట్లు గుర్తించారు.  
కాక్స్‌ టౌన్‌లో నివసిస్తే నెలకు కేవలం రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకే సంపాదన ఉంటోందని, అదే హైదరాబాద్‌ లాంటి నగరాలకు వచ్చేస్తే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నామని టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన ముగ్గురు రోహింగ్యాలు వెల్లడించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top