మూడిళ్లలో దొంగలు పడ్డారు

Robbery in Three Houses Chittoor Madanapalle - Sakshi

రెండు వేర్వేరు ఊళ్లలో చోరీలు

బంగారు నగలు, నగదు పట్టుకెళ్లిన దుండగులు

జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల ఆది, సోమవారాల్లో దొంగలు పడ్డారు. మొత్తం మూడు ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. దాదాపు 170 గ్రాముల బంగారు నగలు, నగదును దుండగులు చోరీ చేశారు. 

చిత్తూరు, మదనపల్లె టౌన్‌ : పట్టణంలోని ప్రశాంతనగర్‌ ఏడో క్రాస్‌లో ఉన్న ఓ ఇంటిలో ఆదివారం అర్ధరాత్రి రాత్రి చోరీ జరిగింది. ఇంట్లోని 152 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు సోమవారం బాధితులు టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌ కథం మేరకు ప్రశాంత నగర్లోని ఓ అద్దె ఇంట్లో ఎం జనార్దన్‌రెడ్డి, హరిత దంపతులు కాపురం ఉంటున్నారు. హరిత ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఆదివారం రాత్రి కుటుంబసభ్యులు ఓ గదిలో నిద్రలోకి జారుకున్నాక గుర్తుతెలియని వ్యక్తులు వంటగదిలో ఎగ్జా స్ట్‌ ఫ్యాన్‌ కోసం ఏర్పాటు చేసిన రంధ్రంలోంచి ఇంటిలోకి చొరబడ్డారు. మరో గదిలో ఉన్న బీరువాను అక్కడే ఉన్న తాళాలతో అలికిడి లేకుండా తీశారు. అందు లో ఉన్న దాదాపు రూ. 4.50 లక్షల విలువ జేసే 152 గ్రాముల బంగారు ఆభరణాలను పట్టుకెళ్లారు. ఉదయం కుటుంబసభ్యులు మంచంపై చెల్లాచెదురుగా పడి ఉన్న ఆభరణాల పెట్టెలను గుర్తించారు. వెంటనే బీరువాలో పరిశీలించి బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించారు. టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ రవిమనోహచారి, సీఐ రాజేంద్ర నాథ్‌ యాదవ్, ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. డీఎస్పీ సమాచారం అందించడంతో వేలిముద్రల నిపుణుడు ఎస్‌ఐ సతీష్‌ కుమార్‌ మదనపల్లెకు చేరుకుని వేలిముద్రలు సేకరించారు. ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కత్తెరపల్లె దళితవాడలో పగలే దొంగలుపడ్డారు   
కార్వేటినగరం : కార్వేటినగరం మండలం కత్తెరపల్లె దళితవాడలో సోమవారం సాయంత్రం చోరీ జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు కత్తెరపల్లె దళితవాడకు చెందిన ద్రాక్షాయిణి, ధర్మయ్య కుటుంబీకులు, దేశమ్మ, శేఖర్‌ కుటుంబీకులు బతుకుతెరువు కోసం కూలి పనులకు వెళ్లారు. రెండు ఇళ్ల వద్ద ఎవరూ లేని సమయంలో దుండగులు తలుపులు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. దేశమ్మ ఇంటిలో 10 సవర్ల బంగారు ఆభరణాలు, రూ 12 వేలు నగదు చోరీ అయింది. ద్రాక్షాయణి ఇంటిలో కొంత వరకు బంగారు నగలు,  వెండి ఆభరణాలతో పాటు నగదు రూ 40 వేలు చోరీ అయినట్లు గుర్తించారు. ఇళ్లలోని వస్తువులకు కొన్నింటిని తీసుకెళ్లి పొలాల్లో పడేసి వెళ్లారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top