పగలు పనులకు.. రాత్రిళ్లు చోరీలకు..

Robbery Gang Arrest in East Godavari - Sakshi

అదును చూసి ఇళ్లు దోచేయడంలో అతడు సిద్ధహస్తుడు

అంబాజీపేటలో పట్టుబడ్డ దొంగ

రూ.5.63 లక్షల విలువైన  బంగారు నగలు, వెండి వస్తువుల స్వాధీనం

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: అతడు పగలు వడ్రంగి పనుల కోసం ఇళ్లకు వస్తాడు. పని చేస్తూనే ఆ ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో గమనిస్తాడు. తలుపులను ఎలా తొలగించవచ్చు? ఏ తలుపులు సునాయాసంగా వస్తాయి? ఇలా ఇంటిని నిశితంగా పరిశీలించి అదును దొరికినప్పుడు ఆ ఇంట్లో చోరీకి పథక రచన చేయడంలో అతడు సిద్ధహస్తుడు.

రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన కుక్కుల శ్రీనివాసరావు వడ్రంగి పని చేస్తూనే అక్రమార్జన కోసం చోరీల బాట పట్టాడు. అంబాజీపేట, అమలాపురం తాలూకా పోలీసు స్టేషన్లలో ఆరు చోరీలకు పాల్పడ్డాడు. 2017–18లో అంబాజీపేట మండలం కోఠివారి అగ్రహారం, నందంపూడి, వ్యాఘ్రేశ్వరం, కె.పెదపూడి, అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం ప్రాంతాల్లో ఈ చోరీలు చేయడంతో ఆయా మండలాల ఎస్సైలు కేవీ నాగార్జున, జి.గజేంద్రకుమార్‌ తమ సిబ్బందితో అతడిపై గట్టి నిఘా పెట్టారు. అమలాపురం రూరల్‌ సీఐ సురేష్‌బాబు ఆధ్వర్యంలో అంబాజీపేట ఎస్సై నాగార్జున చోరీలకు పాల్పడిన శ్రీనివాసరావును అంబాజీపేట గ్యాస్‌ కంపెనీ సమీపంలో గురువారం ఉదయం మాటు వేసి పట్టుకున్నారు.

క్రైమ్‌ పార్టీ కానిస్టేబుల్‌ లంకాడి శ్రీనివాసరావు కూడా కుక్కల శ్రీనివాసరావును పట్టుకోవడంలో చొరవ చూపారు. అరెస్ట్‌ చేసిన శ్రీనివాసరావు వద్ద నుంచి రూ. 5.63 లక్షల విలువైన 81 గ్రాముల బంగారు నగలు, ఎనిమిది కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ అయిన శ్రీనివాసరావును అమలాపురం రూరల్‌ సీఐ సురేష్‌బాబు రూరల్‌ పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో గురువారం ఉదయం విలేకర్ల ముందు ప్రవేశపెట్టారు. అలాగే అతడు చోరీ చేసిన బంగారు నగలు, వెండి వస్తువులను కూడా ప్రదర్శించారు. శ్రీనివాసరావు తొలుత ఇళ్లలోకి వడ్రంగి మేస్త్రిగా పనికి వచ్చి చోరీలకు అనువైన ఇళ్లను ఎంచుకుని పనిచేస్తున్న సమయంలో తాను చేయబోయే చోరీలకు ప్లాన్‌ చేసుకుంటాడని సీఐ సురేష్‌బాబు తెలిపారు. ఇంతటి సొత్తును రికవరీ చేసిన ఎస్సైలు నాగార్జున, గజేంద్రకుమార్, క్రైమ్‌ పార్టీ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావులను సీఐ సురేష్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top