బలైపోయిన బంగారు బొమ్మ

Road Accident in Tuni - Sakshi

ఇసుక ట్రాక్టర్‌ ఢీకొని చిన్నారి దుర్మరణం

పదేళ్లకే నిండిన నూరేళ్లు

అంతవరకూ ఆడుతూ అనంత లోకాలకు

అప్పటి వరకూ తల్లిదండ్రులతో సరదాగా గడిపిన ఆ చిన్నారి అల్పాహారం కోసం వెళ్లి అనంతలోకాల్లో కలిసిపోయింది. అందరూ చూస్తుండగానే ‘అమ్మా’ అని ఆక్రందన చేస్తూ ఇసుక ట్రాక్టర్‌ చక్రాల కింద నలిగిపోయింది. కాపాడే ప్రయత్నం చేసేలోపే మృత్యు కౌగిట్లోకి వెళ్లిపోయింది. నాలుగో తరగతి చదువుతున్న పదేళ్ల వయసున్న ఈ బాలిక పేరు రాణి. పేరుకు తగ్గట్టుగానే ముగ్దమనోహర రూపం...చలాకీతనంతో అందరినీ ఆకట్టుకుంటూ ’రాణి’స్తున్న ఆ పాపను విధి కాటేయడంతో విషాదం అలముకుంది. 

స్వచ్ఛమైన మల్లెలాంటి నవ్వు.. 
కలువల్లాంటి కళ్లు.. బంగారుబొమ్మలాంటి రూపంతో.. ఆ ఇంట వెలసిన దేవతలాంటి ఆ చిన్నారి.. అప్పటివరకూ ఆడుతూ పాడుతూ.. తల్లిదండ్రులతో ఆనందంగా గడిపింది. ఉదయం టిఫిన్‌ తెచ్చుకుందామని బయలుదేరింది. అంతలోనే మృత్యుశకటం 
ఆమె పైకి దూసుకువచ్చింది. ఆ క్షణంలో ఆమె పెట్టిన ఆక్రందన అందరినీ కలచివేసింది. మరుక్షణంలోనే 
ఆ అపరంజి బొమ్మ విగతజీవిగా మారిపోయింది. 

తుని : అప్పటివరకూ తల్లిదండ్రులతో సరదాగా గడిపిన ఆ చిన్నారిని ఇసుక ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఇసుకలపేటకు చెందిన చలికే నాగమణి, చిన్న దంపతుల కుమారుడు, కుమార్తె ఎస్తేరురాణి (10) ఉన్నారు. స్థానిక ప్రైవేటు స్కూలులో ఎస్తేరురాణి నాలుగో తరగతి చదువుతోంది. శనివారం ఉదయం టిఫిన్‌ తెచ్చుకుందామని సమీపంలోని హోటల్‌కు బయలుదేరింది. అదే సమయంలో స్థానికంగా కడుతున్న ఓ ఇంటికి ఇసుక లోడుతో ఓ ట్రాక్టర్‌ ఎదురుగా వస్తోంది. అసలే అది చాలా ఇరుకైన రోడ్డు. ఎదురుగా అభంశుభం తెలియని చిన్నారి వస్తోందని కూడా డ్రైవర్‌ చూడలేదు.

నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ను ముందుకు పోనిచ్చాడు. ప్రమాదం నుంచి తప్పించుకొనే అవకాశం లేకపోవడంతో ఎస్తేరురాణి ఆ ట్రాక్టర్‌ కింద పడి దుర్మరణం పాలైంది. పట్టణ ఏఎస్సై శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని తుని మండలం డి.పోలవరానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ కొరుప్రోలు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్రాక్టరుకు సంబంధించి ఏవిధమైన పత్రాలూ లేవు. డ్రైవర్‌ నాగేశ్వరరావుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా లేదు. చిన్నారి మృతికి కారకుడైన నాగేశ్వరరావును చూసి స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశారు. ఎస్తేరురాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అమ్మా! మమ్మల్ని వదలిపోయావా?

బంగారుబొమ్మలా ఉన్న ఎస్తేరురాణి ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలియడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ప్రమాదంలో కుమార్తె చనిపోయిన విషయం తెలుసుకున్న తల్లి నాగమణి సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ‘‘అమ్మా మమ్మల్ని వదిలిపోయావా?’’ అంటూ కుటుంబ సభ్యులు దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించారు. ఎస్తేరురాణి మృతితో ఇసుకలపేట శోకసంద్రంగా మారింది. ఏ ఇంటి దగ్గర చూసినా మహిళలు ఆ చిన్నారిని తలచుకొని కన్నీటిపర్యంతమయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top