పార్థీ గ్యాంగ్‌ ముసుగులో పాతకక్షలు

Retribution In The Pursuit Of Parthi Gang - Sakshi

దొంగలముఠా పేరుతో అమాయకులు బలి

ఐదు రోజులుగా పల్లెల్లో  పెరుగుతున్న భౌతికదాడులు

అపరిచితులు కనబడితే  పార్ధీ గ్యాంగ్, అంటూ ప్రచారం

సోషల్‌ మీడియా వేదికగా వేగంగా విస్తరిస్తున్న భయం

ఇదే అదనుగా వ్యక్తిగత కక్షలూ తీర్చుకుంటున్న వైనం

‘అదిగో పులి... అంటే ఇదిగో తోక’ అన్నట్టు పుకార్ల సంస్కృతి విస్తరిస్తోంది. జిల్లాలో రోజూ ఏదో ఒకచోట పిల్లల్ని ఎత్తుకెళ్లిన ముఠా సంచరిస్తోందంటూ అబద్ధపు ప్రచారం సాగుతోంది. భాష తెలియని అపరిచితులు జనం ఆగ్రహానికి బలైపోతున్నారు. అమాయకులు... మతిస్థిమితం కోల్పోయేవారు ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో ఎలాంటి గ్యాంగ్‌ లేదంటూ పోలీసులు ప్రచారం చేస్తున్నా... దాడులు  ఆగడంలేదు. ఈ పరిస్థితులు ఎటు దారితీస్తున్నాయన్నది అంతుచిక్కడంలేదు.

సాక్షిప్రతినిధి, విజయనగరం : భోగాపురం మండలం, మహారాజుపేట వద్ద గత శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు విడిచాడు. జిల్లాలో పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగులు తిరుగుతున్నాయని భయపడి పిల్లాడ్ని అమ్మమ్మ వాళ్లింట్లో జాగ్రత్తగా దాచిపెట్టడానికి తండ్రి తీసుకువెళుతుండగా ఈ ఘోరం జరిగింది.

పూసపాటిరేగ మండలం, చింతపల్లి గ్రామంలో బిక్షాటనకు వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో దొంగతనానికి వచ్చాడని భావించిన గ్రామస్తులు కొందరు అతనిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు అతను చనిపోయాడు.

నెల్లిమర్ల జూట్‌ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పరాయి రాష్ట్రానికి చెందినవారిని అనుమానంతో స్థానికులు పట్టుకున్నారు. విషయం తెలుసుకుని వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించి విచారించగా వారు పరిశ్రమలో ఉద్యోగులని తేలింది.ఇలాంటి సంఘటనలు గడచిన ఐదు రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో సంభవిస్తూనే ఉన్నాయి.

ఈ దాడులకు కారణం జిల్లా ప్రజల్లో నెలకొన్న అనవసర భయాలే. జిల్లాలో పార్థీ గ్యాంగులు, చెడ్డీ గ్యాంగులుతిరుగుతున్నాయని, బీహార్‌ దొంగల ముఠావ చ్చిందని, చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయి చంపి అవయవాలు అమ్ముకుంటున్నారని, పెద్దవాళ్ల పీకలు కోసేస్తున్నారని, రకరకాల ప్రచారం విస్తరిస్తోంది.

ఐదు రోజులుగా సాగుతున్న ఇలాంటి పరిణామాలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడంతో పా టు అమాయకులను శిక్షించేలా చేస్తున్నాయి. తప్పుచేసిందెవరో తెలియకుండా కొత్తవారు కనిపి స్తే చాలు చావగొట్టే పరిస్థితులు నెలకొన్నాయి. 

కొంప ముంచిన సామాజిక మాధ్యమాలు

ఈ అనర్థాలకు ప్రధాన కారణం కొందరు పనీపాటా లేని వ్యక్తులు వాట్సాప్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా గ్రూపుల్లో ఎక్కడివో ఫొటోలు, వీడియోలు మన దగ్గరే జరిగినట్లు భ్రమింప జేస్తూ మెసేజ్‌లు పోస్ట్‌ చేయడమే. అవి నిజమైనవో కావో తెలుసుకోకుండానే మరికొందరు వాటిని షేర్‌ చేస్తుండటం వల్ల తక్కువ సమయంలోనే జిల్లా అంతటా ఈ ప్రచారం పాకేసింది.

వెం టనే తేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు అలాం టి ప్రచారాలు నమ్మవద్దని ప్రకటనలు చేసినా వారి మాటలను పట్టించుకోకుండా ఇంకా అమాయకులపై దాడులు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రచారాన్ని కొందరు వ్యక్తులు తమ పాత కక్షలు తీర్చుకోవడానికి అవకాశంగా కూడా తీసుకుంటున్నారు.

గరుగుబిల్లి మండలం కొత్తూరులో ఓ వ్యక్తి బహిర్భూమికి వెళితే గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడిచేసి అతనిని గాయపరిచారు. నెపం మాత్రం గ్యాంగులపై తోసేశారు.

అమాయకులు బలి

ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలో ఉపాధి, వ్యాపారం, జీవనం కోసం ఎంతోమంది వస్తుంటారు. అలా వచ్చినవారే నెల్లిమర్ల జ్యూట్‌మిల్లు కార్మికులుగా కూడా పనిచేస్తున్నారు. మంగళవారం వారిని కూడా అనుమానించి స్థానికులు పోలీసులకు అప్పగించారు. వారు తమ కార్మికులేనని మిల్లు యజమాని చెప్పడంతో విడిచిపెట్టారు. గుమ్మలక్ష్మీపురం మండలం అల్లువాడలో దొంగలనే నెపంతో కొందరిని పోలీసుల వద్దకు తీసుకువచ్చారు.

వారిని విచారిస్తే బొమ్మలు అమ్ముకునేవారని తేలింది. నాలుగు రోజుల క్రితం విజయనగరంలో ఇద్దరు మతిస్థిమితం లేని వారిని అనుమానించి పోలీసులే స్టేషన్‌కు తీసుకుపోయి విచారించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రోజూ రెండు మూడు సంఘటనలు జరుగుతున్నాయి.

మరోవైపు జనం భయంతో వణికిపోతున్నారు. గ్రామాల్లో యువకులు రాత్రి సమయాల్లో కర్రలు, మారణాయుధాలతో గస్తీ తిరుగుతూ కాపలా కాస్తున్నారు. ఇంకోవైపు పోలీసులు వేరే పనులన్నీ మానుకుని జనానికి అవగాహన కల్పించే పనిలో పడ్డారు. ఆటోల్లో మైకులు పెట్టి గ్యాంగులేమీ లేవంటూ ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు పంచిపెడుతూ భయపడొద్దని చెబుతున్నారు.

అమాయకులపై దాడులు వద్దు

మతిస్థిమితం లేనివాళ్లు, అమాయకులపై దాడులు చేయడం సరికాదు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి. ఇప్పటికే జిల్లా ఎస్పీ పలుమార్లు ప్రకటనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

అయినప్పటికీ ఎటువంటి మార్పు రాకపోవడం విచారకరం. ప్రజలు కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. మానవహక్కులకు భంగం కలిగించరాదు. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వండి. – ఎస్‌.అచ్చిరెడ్డి, మానవహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, విజయనగరం

పుకార్లు చేసే వారిపై చర్యలు తప్పవు

పుకార్లను వైరల్‌ చేసే వారిపై ఐటీ చట్టం ప్రకారం చర్యలు తప్పవు. ఇప్పటికే అదుపులో ఉన్న వ్యక్తుల గురించి నెల్లిమర్ల పోలీసులు విచారణ చేపట్టారు. వారంతా నెల్లిమర్ల జ్యూట్‌మిల్లులో పనిచేస్తున్నారన్నారని మిల్లు మేనేజరు నిర్థారించారు.

తెలియని విషయాలను అనవసరంగా ఇతరులకు పంపి, వారిని భయబ్రాంతులకు గురిచేయవద్దు. అనుమానితులు ఎవరైనా కనబడితే వారిపై భౌతిక దాడులకు పాల్పడకుండా, పోలీసులకు అప్పగించాలి.

మన ప్రాంతాల్లో ఎటువంటి గ్యాంగులు సంచరించడంలేదు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపై ఐటీ చట్టం ప్రకారం చర్యలు తప్పవు. పుకార్లు పుట్టించే వారిపై ఇప్పటికే నిఘా ఉంచాం. – జి.పాలరాజు, ఎస్పీ, విజయనగరం.

ప్రజల్లో అవగాహన పెరగాలి

ప్రజలు సాధారణ విషయాలను నమ్మకపోయినా,  ఇటువంటి రూమర్లను బాగా నమ్ముతారు. సామాజిక వెబ్‌సైట్లలో ఇటువంటి పోస్టింగులు ఎక్కువయ్యాయి. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెరగాలి. మతిస్థిమితం లేని వాడు ఏమీ మాట్లడలేడు.

సమాజంలో వాళ్లే ఒక రకంగా దురదృష్టవంతులు. ఎటువంటి ఆసరా లేక అలా తిరుగుతుంటారు. భాషరాదు, సరిగ్గాచెప్పలేరు. విజయనగరంలో ఎక్కువ మతిస్ధిమితం లేనివారు మన భాష రానివారే ఉన్నారు.

ఒడిశా, కలకత్తా, బీహార్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఉన్నారు. ప్రజలు వారిని కాసేపు పరిశీలించాలి. ఏమైనా సందేహం కలిగితే వెంటనే పోలీసులకు అప్పగించాలి. కొట్టే అధికారం ఎవరికీ లేదు.  మారణాయుదాలు గానీ ఉంటే తీసుకుని, పెనుగులాడడం సరికాదు. 

– డాక్టర్‌ ఎన్‌.వి.ఎస్‌.సూర్యనారాయణ, సైకాలజిస్ట్, విజయనగరం   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top