పార్థీ గ్యాంగ్‌ ముసుగులో ఎర్రచందనం రవాణా | Red Wood Smuggling With Parthi Gang Name | Sakshi
Sakshi News home page

పార్థీ గ్యాంగ్‌ ముసుగులో ఎర్రచందనం రవాణా

Apr 30 2018 9:45 AM | Updated on Apr 30 2018 9:45 AM

Red Wood Smuggling With Parthi Gang Name - Sakshi

స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు

రేణిగుంట:రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న పార్థీ గ్యాంగ్‌ ముసుగులో ఎర్ర స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్న విషయాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బట్టబయలు చేశారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామానగర్‌ సమీపంలోని అటవీ ప్రాంతం గుండాలకోన నుంచి ఎర్రచందనం తరలిస్తున్న వారిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశా రు. ఎర్ర స్మగ్లర్లు పారిపోగా వారు పడవేసిన 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌ఎస్‌ఐ విజయనరసింహులు కథనం మేరకు.. రోజు వారి తనిఖీల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి ఆర్‌ఎస్‌ఐ విజయనరసింహులు, డీఆర్‌వో శ్రీనివాసరావు, ఎఫ్‌ఎస్‌వో నాగరాజు తమ సిబ్బందితో కలిసి తారకరామానగర్, గుండాలకోన వద్ద గస్తీ చేపట్టారు.

శ్రీనివాసపురం గ్రామం వద్ద పార్థీ గ్యాంగ్‌ ఉన్నట్లు అలజడి రేగిందని తెలుకుని గ్రామశివారున ఉన్న మరో టీంకు సమాచారం అందించారు. దుండగులు పార్థీ గ్యాంగ్‌ సభ్యులు కాదని, ఎర్రచందనం దొంగలని నిర్ధారించుకున్న పోలీసులు రెండు బృందాలుగా అక్కడికి చేరుకుని వెంబడించారు. దీంతో ఎర్రస్మగ్లర్లు తమ వద్దనున్న దుంగలను పడేసి గుండాల కోన నుంచి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. 675 కిలోల బరువున్న 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గత 20 రోజులుగా గ్రామంలో అలజడి ఉన్నందున తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని శ్రీనివాసపురం, తారకరామానగర్‌ వాసులు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఏసీఎఫ్‌ నాగార్జునరెడ్డి, ఆర్‌ఐ చంద్రశేఖర్, మురళి, ఎఫ్‌ఆర్‌వో ప్రసాద్‌ పరిశీలించారు. ఆపరేషన్‌ టీంలో ఆర్‌ఎస్‌ఐ విజయనరసింహులు, డీఆర్‌వో శ్రీనివాసులు, ఎఫ్‌ఎస్‌వో నాగరాజురెడ్డి, జగదీష్, నవీన్, మోహన్, రెడ్డెప్ప, ముజీఫ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement