
దాతీ మహరాజ్‌పై లైంగిక దాడి కేసు నమోదు
సాక్షి, న్యూఢిల్లీ : స్వామీజీగా చెప్పుకునే దాతీ మహరాజ్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. ఈ కేసును సీబీఐకి బదలాయించిన ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. గతంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు విచారణను చేపట్టారు. దాతీ మహరాజ్‌తో పాటు ఆయన శిష్యులపై 25 ఏళ్ల మహిళ లైంగిక దాడి ఆరోపణలు చేశారు. పదేళ్లుగా దాతీ మహరాజ్ వద్ద తాను శిష్యరికం చేశానని, అయితే ఆయనతో పాటు ఇద్దరు శిష్యులు తనపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం తాను రాజస్థాన్‌లోని తన స్వస్ధలానికి వెళ్లిపోయానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు.
ఓ మహిళా శిష్యురాలు స్వామీజీ గదిలోకి తనను బలవంతంగా తీసుకెళ్లిందని, తాను తిరస్కరించగా ఇతర శిష్యురాళ్లూ ఆయనతో గడిపారంటూ తనను లొంగదీసుకున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. స్వామీజీని, ఆయన సోదరులను అరెస్ట్ చేసి, రెండు ఆశ్రమాలను స్వాధీనం చేసుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో బాధితురాలు కోర్టును కోరారు. దాతీ మహరాజ్‌ను అరెస్ట్ చేయడంలో విఫలమైన పోలీసులను, దర్యాప్తు సంస్ధలను కోర్టు తీవ్రంగా మందలించింది.