విషసంస్కృతి విస్తరణ!

Prostitution Scandals In Guntur - Sakshi

రాజధానిలో చాపకింద నీరులా వ్యభిచారం

మహిళలను వ్యభిచార ఊబిలోకి దింపుతున్న వైనం

సాక్షి, అమరావతిబ్యూరో/తుళ్లూరు రూరల్‌ : అమరావతి రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో కొన్ని ముఠాలు గుట్టు చప్పుడు కాకుండా  వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా తుళ్లూరు, మంగళగిరి మండల కేంద్రాలతో పాటు వెలగపూడి సచివాలయం పరిసరాలకు ఈ విష సంస్కృతి విస్తరించింది. పోలీసులు దాడులు చేస్తున్నా ముఠా పెద్దలను పట్టుకోలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట తుళ్లూరు మండల కేంద్రం సమీపంలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక నిఘాతో పలువురు మహిళలు, విటులను పట్టుకున్నారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి, కోర్టుకు పంపించి చేతులు దులుపుకొన్నారు.

హోటళ్లపై నిఘా ఏదీ...?
రాజధాని ప్రాంతం కావడంతో మందడం గ్రామం దగ్గర నుంచి దాదాపుగా వెలగపూడి వరకు పదుల సంఖ్యలోనే హోటళ్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి గదులసౌకర్యం కూడా ఉంది. ఈ హోటళ్లకు రాకపోకలు సాగిస్తున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులకు తెలపాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. అయితే ఒక్క హోటల్‌ వివరాలు కూడా తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు రావడంలేదు. గదుల బుకింగ్‌ వివరాలు, రాత్రి వేళల్లో బసచేసే వారి వివరాలను తప్పని సరిగా తెలపడం యాజ మాన్యం బాధ్యత. అయితే ఇంత వరకు ఈ సమాచారాన్ని అందిస్తున్న దాఖలాలు లేవు.

గతంలో పటిష్ట చర్యలు
గతంలో ఏఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తుళ్లూరు సబ్‌డివిజన్‌ అధికారిగా  పనిచేస్తున్న సమయంలో ప్రతి విషయంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జూదం, వ్యభిచారం, కోడిపందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. సమస్యల మూలాల వరకు వెళ్లి విచారణ చేపట్టారు. పట్టుబడిన వారిపై, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అధికారులు మాత్రం అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యమంత్రి బందోబస్తు, నిరసనలు, దీక్షలు, శాంతిభద్రతలపైనే దృష్టి సారిస్తుండండతో వ్యభిచార నిర్వాహకులు తమ పరి«ధిని విస్తరించుకుంటూపోతున్నారు. పైగా ఎవరూ పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతో రాజకీయ నాయకుల పలుకుబడి ఉన్న వారు కూడా వ్యాపారంగా ఎంచుకోవడం రాజధానిలో కనిపిస్తోంది. ఇప్పటికైనా పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు రాజధాని ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం
వ్యభిచారం వంటి ఆగడాలను అరికట్టేందుకు పటిష్ట నిఘాఏర్పాటు చేస్తాం. ఇప్పటి వరకు మాదృష్టికి వచ్చిన సమాచారం ప్రకారం ఎక్కడ నిర్వహించినా అదుపులోకి తీసుకున్నాం. నిందితులను కోర్టుకు హాజరుపరిచాం. ప్రస్తుతం రాజ ధాని ప్రాంతంలో సబల ప్రత్యేక  బృందాలు ఉన్నాయి. వీటి ద్వారా మహిళల పై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. వ్యభిచారం జరుగుతుందని తెలిస్తే వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందజేయండి. సమాచారాన్ని అందింన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.– యు.సుధాకరరావు, సీఐ, తుళ్లూరు 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top