కుళ్లబెట్టి..ఉడకబెట్టి!

poultry wastagwe using for fish Cultivation - Sakshi

కోళ్ల వ్యర్థాలతో చేపల సాగు

రాత్రి వేళ గుట్టుగా వ్యర్థాల తరలింపు

సాగుఖర్చులు తగ్గించుకునేందుకు రైతుల యత్నం

కొందరు చేసే తప్పులకు ఆక్వా పరిశ్రమపై మచ్చ

చేపలు మంచి పోషకాహారం. వైద్యులు సైతం చేపలు తినాలని సూచిస్తుంటారు. మాంసాహారులు చేపలను ఇష్టంగా తింటారు. అదే కొల్లేరు చేపలంటే మరింత మక్కువ చూపుతారు. అయితే కొందరు ఆక్వా రైతులు సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు తక్కువ ధరకు లభించే కోళ్ల వ్యర్థాలను చేపలకు మేతగా వాడుతున్నారు. ఆ చేపలను తింటే పోషకాల మాట అటుంచి అనారోగ్యం తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

కైకలూరు: చేపల సాగుకు కైకలూరు నియోజకవర్గం పెట్టింది పేరు. ఆ పేరుకు కొంత మంది రైతులు చెడ్డపేరు తీసుకొస్తున్నారు. సాగు ఖర్చును తగ్గించుకునేందుకు పిల్లెట్‌ మేతకు బదులు, కోళ్ల వ్యర్థాలను అందిస్తున్నారు. జిల్లాలో లక్షా 60 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. అత్యధికంగా కొల్లేరు ప్రాంతంలో 80 వేల ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు జరుగుతోంది. అనధికారికంగా ఇంకా ఎక్కువ విస్తీర్ణంలోనే ఆక్వా సాగవుతోంది. నిత్యం రోజు కొల్లేరు ప్రాంతం నుంచి 30 లారీల చేపలు పశ్చిమబెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.
సాగు ఖర్చులు

తగ్గించుకునేందుకు..
కైకలూరు నియోజకవర్గంలో బొచ్చ, శీలావతి వంటి తెల్లజాతి చేపలు కాకుండా ఫంగేషియన్‌ (ఫంగస్‌) చేపల సాగు 1100 ఎకరాల్లో జరుగుతోంది. ఈ రకం చేపలు ఎటువంటి ఆహారమైనా జీర్ణించుకుంటాయి. ఈ నేపథ్యంలో కొందరు రైతులు ఫంగస్‌ చేపలకు కోళ్ల వ్యర్థాలను మేతగా వాడుతున్నారు. గతంలో క్యాట్‌ఫిష్‌ చేపలకు మాత్రమే కుళ్లిన మాంసం వ్యర్ధాలను వినియోగించేవారు. ఇప్పుడు క్యాట్‌ఫిష్‌ సాగు జరగడం లేదు. దీంతో ఫంగస్‌ చేపలను సాగు చేసే చిన్నచిన్న చెరువుల్లో కోళ్ల వ్యర్థాలను మేతగా అందిసున్నారు. సాధారణంగా నీటిలో తేలియాడే పిల్లెట్‌ మేత కిలో రూ.35 నుంచి రూ.40 ధర పలుకుతోంది. ఎకరా చెరువులో 7 వేల చేప పిల్లలను వదిలి ఆరు నెలలు సాగు చేసేందుకు పిల్లెట్‌మేత వాడితే రూ.3.05 లక్షల ఖర్చువుతుంది. అదే కోళ్ల వ్యర్థాలను వినియోగిస్తే రూ.లక్ష లోపే ఖర్చవుతుంది. 30 కిలోల వ్యర్థాల టిన్ను రూ.300లకే లభిస్తుంది. పట్టుబడికి కొన్ని రోజుల ముందు తువడును మేతగా అందిస్తారు. దీంతో చేపలు మంచి సైజుకు పెరుగుతాయి.

కాసులు కురిపిస్తున్న కోళ్ల వ్యర్థాల రవాణా
కోళ్ల వ్యర్థాల రవాణా అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. వ్యర్థాలు రవాణాచేసే వారు కొల్లేరుతోపాటు గుడివాడ, విజయవాడ వంటి ప్రాంతాల్లోని మాంసం విక్రేతలకు నెలకు రూ.5 వేల చొప్పున ముందుగానే చెల్లిస్తారు. మాంసం దుకాణాల్లో మిగిలే వ్యర్థాలను అర్ధరాత్రివేళ ఆటోలు, ట్రక్కుల్లో చెరువుల వద్దకు చేరుస్తారు. టిన్ను రూ.300 చొప్పున విక్రయిస్తారు. ఆటోలు రాగానే చేపల రైతులు వ్యర్థాలను చెరువులో విసేరిస్తున్నారు. మరికొందరు ఉడకబెట్టిన తరువాత చెరువుల్లో మేతగా వాడుతున్నారు. విజయవాడ నుంచి గుడివాడ, కైకలూరు మీదుగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు కోళ్లు వ్యర్థపదార్థాల రవాణా జరుగుతోంది. గత శనివారం రాత్రి మండవల్లి మండలం ప్రత్తిపాడులో ఫింగేషియన్‌ చేపల చెరువు వద్ద కోళ్లు వ్యర్థాలతో వచ్చిన ఆటో మీడియాకు చిక్కింది.

జీఓ అమలు ప్రశ్నార్థకం..
పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి చేటుచేస్తున్న వ్యర్థాల రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేస్తూ 2016 డిసెంబర్‌ 4న జీఓ 56ను ప్రభుత్వం విడుదల చేసింది. మండల స్థాయిలో తహసీల్దారు చైర్మన్‌గా, వీఆర్వో, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్, పోలీసు అధికారి సభ్యులుగా, మెంబరు కన్వీనరుగా ఫిషరీస్‌ అధికారి వ్యవహరిస్తారు. ఈ కమిటీలపై పర్యవేక్షణ అధికారం కలెక్టరుకు ఉంటుంది. వ్యర్థాలు రవాణాచేస్తూ వాహనాలు పట్టుబడితే డ్రైవర్ల లైసెన్సు, రవాణా పర్మిట్లు రద్దు చేసి, వాహన యజమాని, డ్రైవర్లపై ఐపీసీ కేసులు నమోదుచేస్తారు. చేపల చెరువు లైసెన్సు రద్దు, రూ.10 వేల జరిమానా విధించొచ్చు. మండవల్లి మండలం ప్రత్తిపాడులో శనివారం రాత్రి వ్యర్థాలతో ఆటో దొరికినా ఇప్పటి వరకు చర్యలు లేవు. తహసీల్దార్‌ మధుసూదనరావును వివరణ కోరగా విచారణ చేస్తున్నామని సమాధానం చెప్పారు.

ఆరోగ్యానికి చేటు
కుళ్లిన మాంసం వ్యర్థాలు అత్యంత ప్రమాదకరం. వ్యర్థాలను ఆహారంగా తీసుకున్న చేపలను తినకూడదు. ఆ చేపలను తిన్న వారికి ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలుషిత ఆహారం వల్ల నులుపురుగులు పెరిగే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు వహించాలి. – డాక్టరు కె.శ్రీలత, మండవల్లి

పరిశ్రమను పాడుచేయొద్దు
చేపల పరిశ్రమపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కొందరు రైతులు చేసే తప్పు మొత్తం పరిశ్రమపైనే పడుతుంది. వ్యర్థాల నియంత్రణకు మా పోరాటం ఫలితంగా ప్రభుత్వం జీఓ 56 విడుదల చేసింది. వ్యర్థాలను ఉపయోగించే రైతులపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – ముదునూరి సీతారామరాజు,రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు, భుజబలపట్నం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top