ఎన్నికల సిబ్బంది చేతివాటం

Policies Handedness In Andhra Pradesh Elections - Sakshi

కర్నూలు: ఎన్నికల సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. తనిఖీల్లో పట్టుబడిన రూ.15 లక్షల నగదు స్వాహా చేశారు. బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మిడుతూరుకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓసియన్‌ బ్రిడ్జి ట్రేడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నారు. ఈయన ఈ నెల 7వ తేదీన రాత్రి ఏపీ 9బీహెచ్‌ 9869 నంబర్‌ గల ఇన్నోవా కారులో తమిళనాడులోని కోయిలపట్టులో ఉన్న కంపెనీలో జమ చేసేందుకు రూ.15 లక్షల నగదు తీసుకుని బయలుదేరారు. కర్నూలు నగర శివారులోని పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల ఎదురుగా ఉన్న ఆంధ్రా బ్యాంకు ఏటీఎం వద్ద ఏపీ21 బీఎఫ్‌ 8268 నంబర్‌ గల షిఫ్ట్‌ కారులో పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ పేరుతో వాహనాన్ని తనిఖీ చేశారు.

అందులో ఉన్న రూ.15 లక్షలకు ఆధారాలను చూపమని కోరగా, తన వద్ద లేవంటూ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. రెండు రోజుల్లో చూపించి డబ్బు తీసుకెళ్లాలని వారు సూచించారు. అయితే.. ఆ డబ్బును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లోని ముగ్గురు సిబ్బంది పంచుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. బాధితుడు చంద్రశేఖర్‌రెడ్డి ఈ విషయంపై ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేయడంతో తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన వాహనాన్ని తనిఖీ చేసిన సిబ్బంది వినియోగించిన కారు నంబర్‌ను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరపగా కానిస్టేబుల్‌ రమేష్, విద్యాశాఖకు చెందిన సింగ్‌తోపాటు కారు డ్రైవర్‌ ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది.  ఐపీసీ 406, 409, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా అర్బన్‌ సీఐ చలపతిరావు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top