టీడీపీ మాజీ నేత బీఎన్‌ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం

Police Ready For TDP Leader BN Reddy Arrest - Sakshi

బంజారాహిల్స్‌: ప్రవాసాంధ్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగించడమే కాకుండా జయరాంతో సెటిల్మెంట్‌ చేసుకునేందుకు పలుమార్లు రాకేష్‌రెడ్డి నివాసానికి వెళ్లిన మాజీ టీడీపీ నేత బీఎన్‌ రెడ్డి అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే బీఎన్‌ రెడ్డి పేరుతో రాకేష్‌రెడ్డిపై దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో జూబ్లీహిల్స్‌ పోలీసులు నమోదు చేశారు. జనవరి 31న జయరాం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 10లోని రాకేష్‌రెడ్డి నివాసంలో హత్యకు గురైన విషయం విదితమే. అంతకుముందు రెండు రోజులు బీఎన్‌ రెడ్డి అక్కడికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య జరిగిన రోజు ఉదయం కూడా బీఎన్‌ రెడ్డి ఆ ఇంటికి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ మేరకు అతడిని దర్యాప్తు అధికారి, బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌ రావు తన కార్యాలయంలో విచారించారు. ఇప్పటికే బీఎన్‌ రెడ్డికి జూబ్లీహిల్స్‌ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. చార్జిషీట్‌లో బీఎన్‌ రెడ్డి పేరును చేర్చిన నేపథ్యంలో అతడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాకేష్‌రెడ్డితో సెటిల్మెంట్‌ చేసుకోవాల్సిందిగా జయరాంపై ఒత్తిడి తేవాలని హత్యకు కొద్ది రోజుల ముందు రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు బీఎన్‌ రెడ్డి నిందితుడు రాకేష్‌రెడ్డిని తీసుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా బీఎన్‌ రెడ్డి గత నెలలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top