
బాలిక కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు పవన్‌కుమార్‌ను అరెస్టు చూపుతున్న ఎస్‌ఐ ప్రసాద్
సాక్షి, రొంపిచెర్ల : సంచలనం సృష్టించిన బాలిక కిడ్నాప్ కేసును రొంపిచెర్ల పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. రొంపిచెర్ల క్రాస్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మండలంలోని రామచంద్రాపురం కాలనీకి చెందిన బాలిక(14)ను బెంగళూరులో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తున్న చిన్నగొట్టిగల్లుకు చెందిన పవన్‌కుమార్(24) తన తమ్ముడు సాయికుమార్(19) స్నేహితులు గోవిందరాజులు(23),రమ్య(22)తో కలసి ఈ నెల 20న రొంపిచెర్లలో కిడ్నాప్ చేయడం విదితమే. ఇక్కడి నుంచి బైక్‌లో బెంగళూరుకు.. ఆపై అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్, ఆ తర్వాత కోయంబత్తూరుకు నిందితుడు బాలికను తీసుకెళ్లడం తెలిసిందే. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రసాద్ కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వెంటాడుతుండడం, కిడ్నాప్ విషయంలో తనకు సహకరించిన వారిలో ముగ్గురిని పోలీసులు అప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలుసుకున్న పవన్‌కుమార్ పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతోకాలం సాగవని గ్రహించాడు.
బాలికను గుట్టుగా రొంపిచెర్లలో వదలి జంప్ అవ్వాలని భావించాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రొంపిచెర్ల క్రాస్‌లోని చెక్‌పోస్టు వద్ద బాలికతో వస్తుండగా పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఇప్పటికే పవన్‌కుమార్‌పై నిర్భయ, ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేయడం తెలిసిందే. అనంతరం పీలేరు కోర్టులో అతడిని హాజరుపరచగా జడ్జి 15 రోజులు రిమాండ్‌కు ఆదేశించినట్లు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితురాలు రమ్యను కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. ఇదలా ఉంచితే, బాలికకు డ్యాన్స్ అంటే ఇష్టం కావడం..పవన్ కుమార్ ఆ బాలిక చదువుతున్న స్కూలులో నృత్య ప్రదర్శన చేయడంతో కలిగిన పరిచయం ఇంతవరకూ దారితీసింది. మరోవైపు ఏఎస్‌ఐ రఘు, కానిస్టేబుళ్లు జైనుద్దీన్, ఇమ్రాన్ వెంటబడడంతో నిందితుడు తప్పించుకోలేకపోయాడు. ఐదు రోజులుగా ఈ కేసు పలు మలుపులు తిరిగి ఎట్టకేలకు సుఖాంతమైంది.