‘కరక్కాయ’ను పట్టించుకోరా..?

Police Department Delayed in Karakkaya Case - Sakshi

కేపీహెచ్‌బీ గోదాంలో మురిగిపోతున్న 81 టన్నుల కరక్కాయలు

వేలం వేసి వచ్చిన డబ్బులు డిపాజిట్‌ చేయాలన్న కోర్టు

పట్టించుకోని సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం

ఆందోళనలో బాధితులు

సాక్షి, సిటీబ్యూరో: కరక్కాయల పొడి పేరుతో జరిగిన చీటింగ్‌   కేసును ఛేదించిన సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు బాధితులకు న్యాయం చేయడంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసిన సమయంలో 81 టన్నుల కరక్కాయలు నిల్వచేసిన కేపీహెచ్‌బీలోని గోదాంను సీజ్‌ చేసిన పోలీసులు ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నెల్లూరు జిల్లా, అంబపురంకు చెందిన ముప్పల మల్లికార్జునతో పాటు దేవ్‌రాజ్‌ అనిల్‌కుమార్, జగన్మోహనరావు, గుండపనేని సురేంద్ర, చిరంజీవి రెడ్డిలను గత నెల 4న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.40,95,000 నగదును కోర్టులో డిపాజిట్‌ చేశారు. ఈ సమయంలో కరక్కాయల విషయమై కోర్టు దృష్టికి తీసుకెళ్లగా  వేలం వేసి వచ్చిన డబ్బులను కోర్టులో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. అయినా ఇప్పటివరకు ఆ దిశగా సైబరాబాద్‌ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కరక్కాయలు కొద్దిరోజుల పాటే నిల్వ ఉంటాయని, ఇప్పటికైనా వాటిని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని బాధితులకు పంచాలని కోరుతున్నారు. 

మా డబ్బులు ఇప్పించండి...
కరక్కాయల పొడి వ్యాపారం ప్రారంభంలో పెట్టుబడులు పెట్టిన వారికి రూ.1,000లకు రూ.300 కలిసి రూ.1300లు చెల్లించారు. దీంతో కొందరు ఏకంగా రూ.90 లక్షలు పెట్టుబడి పెట్టగా, మరో రూ.30 లక్షలు కలిసి రూ.1.20 కోట్లు చెల్లించారు. దీంతో అతను రెండోసారి రూ.60లక్షలు పెట్టుబడి పెట్టాడు. మిగతావారు కూడా తొలిసారి డబ్బులు తిరిగి ఇవ్వడంతో నమ్మకం పెరిగి లబ్దిదారులు మరికొంత మందిని చేర్చారు. కొందరు తమ బంధువులను సైతం ఈ ఊబిలోకి లాగారు. చివరకు తమ కంపెనీలో పనిచేసే సిబ్బందితో కూడా పెట్టుబడులు పెట్టించారు.  ఇలా 650 మంది మోసపోయారు. వీరిలో 500 మంది మహిళలు కావడం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వేదిక ఈ మోసం జరిగింది. మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీల్లో పనిచేసిన అనుభవంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్న నిర్వాహకులకు నెల్లూరుకు చెందిన గుండపనేని సురేంద్ర, తిన్నలూరు మహే శ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు నోటి చిరంజీవి రెడ్డి సహకరించారు. అయితే తమ డబ్బులు ఇవ్వడం లేదని నలుగురు వ్యక్తులు కేపీహెచ్‌బీ ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు తెలియడంతో వీరు పరారయ్యారు. మహారాష్ట్ర, కర్ణాటక, పాండిచ్చేరి, ఢిల్లీ రాష్ట్రాల్లో వీరికోసం గాలించిన పోలీసులు చివరకు కేపీహెచ్‌బీ ఠాణాలోని రాఘువేంద్రకాలనీలో ఆగస్టు 4న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.  వారు దొరికి తే మరికొంత నగదు స్వాధీనమయ్యే అవకాశముందని పోలీసులు చెబుతున్నా ఇంతవరకు పట్టుకోలేకపోయారు. అయితే స్వాధీనం చేసుకున్న డబ్బులతో పాటు కరక్కాయలు అమ్మగా వచ్చిన డబ్బులను వెంటనే కోర్టు ద్వారా ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top