మానసిక రోగికి చిత్రహింసలు

Police Beats Mentally Challenged Person In Tamilnadu - Sakshi

చెన్నై: నాగై సమీపంలో మానసిక రోగి రెండు చేతులు వెనుకకు కట్టి పోలీసులు చితకబాదుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతోంది. నాగై జిల్లా కొల్లిడం సమీపం బట్విలాకం గ్రామానికి చెందిన జాన్సన్‌ (47) మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఇతనికి  వివాహం కాలేదు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న జాన్సన్‌ ఎదురు ఇంట్లో ఉంటున్న అన్న చార్లెస్‌ (55) వద్ద ఖర్చులకు నగదు తీసుకొనే వాడని తెలిసింది. రోజులాగే శనివారం అన్న చార్లెస్‌ వద్దకు వెళ్లి ఖర్చులకు నగదు ఇవ్వాలని అతన్ని ఇబ్బంది పెట్టాడు. దీంతో విసిగిపోయిన చార్లెస్‌ తమ్ముడు జాన్సన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కొల్లిడం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కొల్లిడం కానిస్టేబుల్‌ కన్నన్‌ బట్విలాకంకు వెళ్లి జాన్సన్‌ను విచారణ కోసం పోలీసుస్టేషన్‌కు రమ్మని పిలిచారు.

ఆ సమయంలో జాన్సన్‌ కర్రతో పోలీసు కన్నన్‌ తలపై దాడి చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న కొల్లిడం ఇన్‌స్పెక్టర్‌ మునిశేఖర్, పోలీసులు అక్కడికి వెళ్లి ఇంటిలోపల ఉన్న జాన్సన్‌ను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి అతని రెండు చేతులు వెనుకకు కట్టి లాఠీలతో చితకబాదారు. అక్కడ గుమికూడిన  గ్రామస్తులు ఇన్‌స్పెక్టర్‌ను ప్రశ్నించగా వారిని బెదిరించినట్టు తెలిసింది. తరువాత జాన్సన్‌ను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదారు. ఈ సమాచారం తెలుసుకున్న చార్లెస్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి తమ్ముడిని విడిపించి తీసుకొచ్చాడు. నడవలేని స్థితిలో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వెలువడడంతో మానసిక రుగ్మత కలిగిన వ్యక్తిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top