దొంగల్ని పట్టించిన వేలిముద్రలు

Police Arrest Thievs With Fingerprints - Sakshi

చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

రూ 2.70 లక్షలు విలువైన బంగారు ఆభరణాల స్వాధీనం

ఈజీ మనీ కోసం దొంగలుగా మారిన వైనం  

నెల్లూరు(క్రైమ్‌): ఈజీ మనీకోసం ఇద్దరూ దొంగలుగా మారారు. ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. ఓ దొంగ వేలిముద్రల ఆధారంగా నెల్లూరులోని చిన్నబజారు పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ఇరుకళల పరమేశ్వరి ఆలయం సమీపంలో నిందితులను అరెస్ట్‌ చేశారు. సోమవారం చిన్నబజారు పోలీసు స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు.

మెక్లెన్స్‌రోడ్డులో ముజీబ్, రబ్బానీ దంపతులు నివాసం ఉంటున్నారు. వారిద్దరూ పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పైసాపైసా కూడపెట్టి బంగారు, వెండి ఆభరణాలు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్‌ 23వ తేదీ రాత్రి ముజీబ్‌ కోటమిట్టలోని తన అత్త ఇంటికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. రాత్రి అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు అతని ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. పడకగదిలోకి వెళ్లి బీరువాను తెరచి అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించుకెళ్లారు. ఈ మేరకు అప్పట్లో బాధితురాలు రబ్బానీ చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ అల్లాభక్షు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రలు ఆధారంగా ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో ఎస్సై కరిముల్లా అతని సిబ్బంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వేలిముద్రల ఆధారంగా..
మైపాడుగేట్‌ సెంటర్‌కు చెందిన ఎ.రాజేష్‌ ఈజీ మనికోసం దొంగగా మారాడు. నవాబుపేట, వేదాయపాళెం, బాలాజీనగర్‌ తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. కొంతకాలం క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన అతనికి కొత్తూరు చంద్రబాబునగర్‌ ఎ–బ్లాక్‌కు చెందిన డి.సందీప్‌తో పరిచయమైంది. ఇద్దరూ కలిసి మెక్లెన్స్‌రోడ్డులోని రబ్బానీ ఇంట్లో గతేడాది దొంగతనానికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రల ఆధారంగా నిందితుల్లో ఒకరు పాతనేరస్తుడు రాజేష్‌ అని తెలియడంతో అతని కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. ఆదివారం అర్ధరాత్రి రాజేష్, సందీప్‌లు ఇరుకళల పరమేశ్వరి ఆలయ సమీపంలోని గేటుసెంటర్‌ వద్ద ఉన్నారన్న సమాచారం చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌కు అందింది. ఆయన ఆధ్వర్యంలో ఎస్సై తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. విచారణలో నిందితులు రబ్బానీ ఇంట్లో దొంగతనం చేశామని, త్వరలో నెల్లూరు నుంచి విశాఖపట్నం పారిపోయి అక్కడ నేరాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పడంతో వారిని అరెస్ట్‌ చేశామని డీఎస్పీ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.2.70 లక్షలు విలువచేసే సుమారు 13 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు.

సిబ్బందికి అభినందన
నిందితులను అరెస్ట్‌ చేసి చోరీసొత్తు రాబట్టేందుకు కృషిచేసిన చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ అన్వర్‌బాషా, ఎస్సై కరిముల్లా, హెడ్‌కానిస్టేబుల్‌ ఎస్‌.భాస్కర్‌రెడ్డి, కానిస్టేబుల్స్‌ ఈ.రమణ, సురేష్, నజ్‌మల్, ఉదయ్‌కిరణ్, అల్తాఫ్‌లను డీఎస్పీ అభినందించారు. త్వరలో ఎస్పీ చేతుల మీదుగా రివార్డులు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. సమావేశంలో ఎస్సై పి. బలరామయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top