మోసపోయి అదే బాట! | Police Arrest Fake Ads In Facebook Cheater Hyderabad | Sakshi
Sakshi News home page

మోసపోయి అదే బాట!

Jul 24 2018 11:07 AM | Updated on Sep 4 2018 5:53 PM

Police Arrest Fake Ads In Facebook Cheater Hyderabad - Sakshi

నిందితుడు లక్ష్మణ్‌

సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు కె.లక్ష్మణ్‌... మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చి సిటీలోని హాస్టల్స్‌లో పని చేశాడు... తక్కువ ధరకు బంగారం పేరుతో మోసగాళ్లు వేసిన ఎరకు చిక్కాడు... రూ.6 లక్షలకు పైగా నష్టపోవడంతో దిక్కుతోచని స్థితికి చేరాడు... ‘పోగొట్టుకున్న చోటే వెతకాలి’ అనే ఉద్దేశంతో తానూ టోకరాలు వేయాలని నిర్ణయించుకున్నాడు... నగరానికి చెందిన ఓ మహిళను రూ.4 లక్షలకు మోసం చేసి నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కేశాడు. ఇతడి నుంచి రూ.3.9 లక్షలు రికవరీ చేసినట్లు డీసీపీ రాధాకిషన్‌రావు సోమవారం వెల్లడించారు. 

హాస్టల్‌ వ్యాపారంలోనూ నష్టంతో...
మహబూబ్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన కె.లక్ష్మణ్‌ బతుకుతెరువు కోసం కొన్నాళ్ల క్రితం సిటీకి వలసవచ్చాడు. అమీర్‌పేట, మాదాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్‌ హాస్టల్స్‌లో పని చేశాడు. ఆపై మహబూబ్‌నగర్‌లో సింధు బాయిస్‌ హాస్టల్‌ పేరుతో తానే సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇతగాడికి ప్రొద్దుటూరుకు చెందిన కొందరితో పరిచయం ఏర్పడింది. తాము బంగారాన్ని, బంగారు ఆభరణాలను తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ లక్ష్మణ్‌కు చెప్పారు. అది తీసుకువచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చంటూ ఎర వేశారు. ఇందుకు అంగీకరించిన ఇతడి నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసిన మోసగాళ్లు వివిధ ప్రాంతాల్లో తిప్పి వట్టి చేతులతో పంపారు. అదే సమయంలో హాస్టల్‌ నిర్వహణలోనూ నష్టాలే ఎదురయ్యాయి. 

తానూ ‘బంగారం బాట’ పట్టి...
దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన లక్ష్మణ్‌ వాటి నుంచి బయటపడేందుకు బంగారం పేరుతో మోసాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసిన ఇతగాడు అందులో అనేక జ్యువెలరీ డిజైన్స్, తన ఫోన్‌ నెంబర్‌ను పొందుపరిచాడు. వీటికి ఆకర్షితురాలైన బంజారాహిల్స్‌కు చెందిన గాయత్రిని కలిసి కొన్ని మోడల్స్‌ చూపాడు. అహ్మదాబాద్‌లో తక్కువ ధరకు లభిస్తాయంటూ చెప్పడంతో ఆమె రూ.6 లక్షల నగలు ఆర్డర్‌ ఇచ్చారు. అడ్వాన్స్‌గా రూ.4 లక్షలు తీసుకున్న లక్ష్మణ్‌ ఆమెకు అహ్మదాబాద్‌ రమ్మన్నాడు. అక్కడకు వెళ్లిన ఆమె ఫోన్‌ చేయగా తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌లో పెట్టి మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లక్ష్మణ్‌ కదలికలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, కేఎస్‌ రవి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్‌ వలపన్ని సోమవారం పట్టుకున్నారు. నిందితుడిని బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement