పీఎంసీ స్కాం, భారీ చార్జిషీట్‌

PMC Bank scam EOW submits 32000-page chargesheet - Sakshi

సాక్షి, ముంబై: సంచలనం రేపిన పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణంలో చార్జిషీటు దాఖలైంది. సుమారు రూ.6,700 కోట్ల కుంభకోణంలో  ఐదుగురిపై 32వేల పేజీల చార్జిషీట్‌ను ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం శుక్రవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించింది. మోసం, మోసం, సాక్ష్యాలను నాశనం చేయడం, తప్పుడు ప్రచారంతో  మభ్యపెట్టడం వంటి ఆరోపణలతో నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

చార్జిషీట్‌లో  బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ థామస్, మాజీ చైర్మన్ వర్యమ్ సింగ్, బ్యాంక్ మాజీ డైరెక్టర్ సుర్జిత్ సింగ్ అరోరాతో పాటు హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్‌డిఐఎల్) ప్రమోటర్లు రాకేశ్ వాధవన్, ఆయన కుమారుడు సారంగ్ వాధవన్  కూడా ఉన్నారు.  బ్యాంకులో ఖాతాదారులతో సహా 340 మంది సాక్షుల వాంగ్మూలాలు  రికార్డు చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 కింద పోలీసులు కీలకమైన నలుగురు సాక్షుల వాంగ్మూలాలను మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పీఎంసీ బ్యాంక్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు, ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఐదుగురితో పాటు, పోలీసులు మరో ఏడుగురు బ్యాంకు అధికారులను కూడా అరెస్టు చేశారు. అయితే వీరిపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. 

పీఎంసీ బ్యాంకు ఇచ్చిన మొత్తం రుణాల్లో 75 శాతం దివాలా తీసిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ హెచ్‌డీఐఎల్‌ కే వెళ్లాయి. హెచ్‌డీఐల్‌ ప్రమోటర్లు, తప్పుడు పత్రాలతో 21 వేల ఫేక్‌ ఖాతాల ద్వారా పీఎంసీ నుంచి రుణాలను పొందారన్నది ప్రధాన ఆరోపణ. బ్యాంకు వార్షిక నివేదికల్లో సైతం హెచ్‌డీఐఎల్‌కు ఇచ్చిన రుణాల వివరాలను పొందుపరచలేదు. అలాగే దివాలా తీసిన తరువాత కూడా ఆ సంస్థకు పీఎంసీ రుణాలను మంజూరు చేస్తూ పోయింది.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top