జాతరలో విషాదం..!

Photo Journlist Died in Current Shock Chittoor - Sakshi

విద్యుదాఘాతంతో ఫొటో జర్నలిస్టు మృతి

కలెక్టర్, పలువురు నేతల పరామర్శ

చిత్తూరు అర్బన్‌ : అప్పటి వరకు తోటి ఫొటోగ్రాఫర్లతో కలివిడిగా తిరిగాడు. పలుచోట్ల కొలువుదీరిన గంగమ్మలను తన కెమెరాలో బంధించాడు. తొలుత తీసిన ఫొటోపై సంతృప్తిచెందక మళ్లీ అమ్మవారి ఫొటో తీయడానికి వెళ్లి విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు. చిత్తూరుకు చెందిన ఓ దినపత్రిక ఫొటో జర్నలిస్టు అనంతపద్మనాభస్వామి మృత్యువాత పడటంపై జిల్లా కలెక్టర్, పాత్రికేయులు, పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాలిలా.. చిత్తూరు గ్రామీణ మండలంలోని బీఎన్‌ఆర్‌.పేటకు చెందిన అనంతపద్మనాభస్వామి (38) ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. మంగళవారం నగరంలో గంగజాతర సందర్భంగా బజారువీధి, కట్టమంచి, సంతపేట ప్రాంతాల్లో కొలువుదీరిన అమ్మవార్ల ఫొటోలు తీసుకున్నాడు. అయితే కొంగారెడ్డిపల్లె జాతరలో అమ్మవారు, భక్తుల ఫొటోలను చూసి సంతృప్తి చెందకుండా మళ్లీ ఫొటోలు తీయడానికి వెళ్లాడు. జాతర వద్ద ఏర్పాటు చేసిన చలువపందిళ్ల కొయ్యలపైకి ఎక్కి ఫొటో తీస్తుండగా విద్యుత్‌లైట్ల కోసం ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. ఈ ప్రమాదంలో స్వామి తలకు బలమైన గాయాలయ్యాయి. హుటాహుటిన ఇతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తరలించి, వన్‌టౌన్‌ ఎస్‌ఐ పురుషోత్తంరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పలువురి సంతాపం..
అనంతపద్మనాభస్వామి మరణవార్త తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న ఆసుపత్రికి చేరుకుని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా రావాల్సిన బీమాను స్వామి కుటుంబానికి అందజేస్తామన్నారు. అలాగే చిత్తూరు ప్రెస్‌క్లబ్‌ నాయకులు, జిల్లా వర్కింగ్‌ జర్నలిస్టు నాయకులు స్వామి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ నాయకులు ఎంఎస్‌.బాబు, జంగాలపల్లె శ్రీనివాసులు, బుల్లెట్‌ సురేష్, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ భాస్కరన్, త్యాగరాజులు, అపోలో మెడికల్‌ కళాశాల యూనిట్‌ ఇన్‌చార్జ్‌ నరేష్‌కుమార్‌రెడ్డి, సీపీఐ నేత నాగరాజన్, గోపినాథ్‌ తదితరులు స్వామి మృతదేహం వద్ద నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top