ఉద్యోగం ఇచ్చిన సంస్థనే..

Person Done Fraud In Medak - Sakshi

పని చేస్తున్న కంపెనీలోనే దొంగతనం

సొంతంగా చేతికి గాయం చేసుకున్న వైనం

24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు 

సాక్షి, రామచంద్రాపురం: పని చేస్తున్న కంపెనీలో డబ్బు దొంగిలించాడు. ఆ దొంగతనం మరెవరో చేశారని యాజమాన్యాన్ని నమ్మించేందుకు చేతికి గాయం చేసుకుని కట్టుకథలు అల్లాడు. మొత్తం రూ.12.5 లక్షలు తస్కరించాడు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మాదాపుర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు, ఏసీపీ కృష్ణప్రసాద్‌లు ఆ వివరాలను పోలీసులకు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. ఆర్సీపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఇండస్ట్రియల్‌ ఏరియాలో పెనుబల్లి సురేందర్‌రెడ్డి అనే వ్యాపారి భార్గవ్‌ ఇండస్ట్రీస్‌ పేరుతో పరిశ్రమను నిర్వహిస్తున్నారు. కంపెనీలో మెటీరియల్‌ కొనుగోలుకు ఈ నెల 9న రూ.12.50 లక్షలను పరిశ్రమలోని ఆఫీసు గదిలోని లాకర్‌లో దాచారు.

అదే కంపెనీలో ఒడిషాకు చెందిన సుశాంత్‌ కుమార్‌ జెనా అనే యువకుడు అసిస్టెంట్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. లాకర్‌లో పెట్టిన సొమ్మును చూసి దాన్ని కాజేసేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలో లాకర్‌ను బద్దలు కొట్టి రూ.12.50 లక్షలను సుశాంత్‌కుమార్‌ దొంగలించాడు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ప్లాన్‌ ప్రకారం తనకు తానుగా గాయాలు చేసుకున్న సుశాంత్‌ గుర్తు తెలియని వ్యక్తులు లాకర్‌ను పగులగొట్టి డబ్బు తీసుకెళ్లారని యజమానిని నమ్మించే ప్రయత్నం చేశారు. తన చేతికి తనే గాయం చేసుకున్నాడు. కట్టుకథతో యాజమాన్యాన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. కంపెనీలో జరిగిన దొంగతనం విషయాన్ని సురేందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించి సుశాంత్‌పై అనుమానంతో విచారించామని పోలీసు అధికారులు వెల్లడించారు. ఆ విచారణలో దొంగతనం చేసిన వెంటనే ఆ సొమ్మును సుశాంత్‌ తన స్వగ్రామానికి చెందిన మరో వ్యక్తి రాజ్‌బిహారీ బెహరాకు రూ.9.30 లక్షలను ఇచ్చి గ్రామానికి వెళ్లాలని పంపించి వేశాడు. ఒడిషా వెళ్తున్న ఆ రాజ్‌ బిహారీని బస్సులో ప్రయాణిస్తుండగా పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద దొరికిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

రూ.1.25 లక్షలు సుశాంత్‌ అప్పు తీర్చాడు. ఆ సొమ్ముతోపాటు మొత్తం డబ్బును పోలీసులు వారిద్దరి నుంచి స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లోనే నేరం చేసిన ఇద్దరిని పట్టుకున్నామని పోలీసు అధికారులు వివరించారు. నిందితులిద్దరినీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారిని జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించనున్నట్లు చెప్పారు. ఈ కేసు పరిశోధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన సీఐ రమేష్‌కుమార్, ఎస్‌ఐలు రవికుమార్, భాస్కర్, కానిస్టేబుళ్లు నారాయణ, యాదయ్య, సత్యనారాయణలను డీసీపీ అభినందించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top