భర్తను కడతేర్చిన భార్య

Person Brutually Murdred Because Of Paramour Relationship In Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల : అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే అతి కిరాతకంగా హత్యచేసిన భార్య ఉదంతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై ఓంకార్‌ యాదవ్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జటంగుల లక్ష్మణ్‌ (50)తన భార్య జనని, కూతుర్లు రమ్య, పండు, కుమారుడు కార్తికేయలతో కలిసి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. లక్ష్మణ్‌ ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా అతని భార్య జనని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వీపర్‌గా పనిచేస్తోంది.

ఈ క్రమంలో జననికి అక్రమ సంబంధం ఉందన్న కారణంతో భార్యాభర్తల ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడి నాలుగేళ్లుగా లక్ష్మణ్‌ తన స్వగ్రామమైన కుమురంభీంజిల్లా కౌటాల మండలంలోని తలోడి గ్రామంలో ఉంటున్నాడు. పెద్దకూతురికి వివాహం కాగా జనని రాజీవ్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఇద్దరు పిల్లలతో ఉంటోంది. పిల్లలను చూసేందుకు లక్ష్మణ్‌ తరచూ వచ్చేవాడు.

ఈ క్రమంలోనే ఈ నెల 24న సాయంత్రం రాజీవ్‌నగర్‌లో ఉంటున్న జనని ఇంటికి వచ్చాడు. మళ్లీ ఎందుకు వచ్చావని ఇద్దరి మధ్యా వాగ్వివాదం జరిగింది. ఇదే అదనుగా భావించిన జనని సోదరుడు పానుగంటి సత్యనారాయణ. తల్లి లక్ష్మిలతో కలిసి హత్య చేసినట్లు మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. జననిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

హత్య జరిగిన తీరు 
24న రాత్రి జనని కుటుంబ సభ్యులు, మరికొందరితో కలిసి లక్ష్మణ్‌ను తీవ్రంగా కొట్టి చనిపోయాడనుకుని బయట స్తంభానికి కట్టేశారు. తెల్లవారుజామున 4గంటలకు వెళ్లి చూడగా బతికే ఉన్నాడని తెలుసుకుని మళ్లీ ఇంట్లోకి తీసుకువచ్చి గొంతు నులిమి చంపారు. మళ్లీ తీసుకువెళ్లి స్తంభానికి కట్టివేశారు. మద్యం సేవించి ఇంట్లో గొడవ చేసినందుకు కాలనీవాసులు స్తంబానికి కట్టేశారని కట్టుకథ అల్లిన జనని ఓస్థానిక నాయకునితో కలిసి పోలీసులకు సమాచారం అందించిందని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు కొందరు నాయకులు యత్నిస్తున్నారన్నారు. హతురాలికి చాలామందితో అక్రమ సంబంధాలున్నాయని, కొంతమంది స్థానిక నాయకులే ఆమెకు అండగా ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top