ప్రచారం ఫుల్‌.. ఫలితాలు నిల్‌

Pending 183 cases in Human trafficking  - Sakshi

 మానవ అక్రమ రవాణా కేసుల్లో శిక్ష శాతం ‘సున్నా’

ఒక్క కేసులోనూ పడని శిక్ష, పెండింగ్‌లోనే 183 కేసులు  

సాక్షి, హైదరాబాద్‌: తీవ్రత కలిగిన నేరాల నియంత్రణలో సక్సెస్‌ అయిన పోలీస్‌ శాఖ.. కీలకమైన మానవ అక్రమ రవాణా కేసుల్లో మాత్రం నిర్లక్ష్యం చూపించినట్టు కనిపిస్తోంది. 2016లో 229 మానవ అక్రమ రవాణా కేసులు నమోదైతే వీటిలో ఏ ఒక్క కేసులోనూ శిక్ష పడకపోవడం ఆందోళనకరంగా కనిపిస్తోంది. నమోదైన వాటిలోనూ కేవలం 46 కేసుల్లోనే పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. మరి మిగతా కేసుల సంగతేంటి? ఇక ఎన్నాళ్లు కేసులు పెండింగ్‌లో ఉంటాయి?మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మానవ అక్రమ రవాణాలో రాష్ట్రం ఎనిమిదో స్థానంలో ఉంది. 2016 ఏడాదిలో 591 మంది నిందితులు మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డట్టు పోలీస్‌ శాఖ అభియోగాలు మోపింది. అయితే వీరిలో 113 మందిపైనే చార్జిషీట్‌ దాఖలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మానవ అక్రమ రవాణా కేసు పట్టుకొని ప్రచారం చేసుకునే పోలీస్‌ అధికారులు వాటి పూర్తి స్థాయి దర్యాప్తు, నిందితులకు శిక్షపడే వరకు మానిటరింగ్‌ చేయకపోవడం అలసత్వమే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

తేలని చిన్నారుల అదృశ్యం కేసులు 
అదేవిధంగా చిన్నారుల మిస్సింగ్‌ కేసులు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క 2016లోనే 3,597మంది తప్పిపోతే వారిలో 1,103 మంది ఇప్పటివరకు దొరకలేదు. వీరంతా ఏమయ్యారు? ఏ వృత్తిలోకి నెట్టబడ్డారు? వారి వెనకున్న ముఠాలేంటి? అసలు బతికే ఉన్నారా? అన్న విషయాలను తేల్చుకోలేని సందిగ్దం ఏర్పడింది. ఇలాంటి కేసుల్లోనూ పెండింగ్‌ తప్ప దర్యాప్తు పూర్తయిన దాఖలాల్లేవు. ఈ కేసుల్లో కన్వెక్షన్‌ రేటు కనీసం 8శాతం దాటకపోవడం ఆందోళనకరంగా కనిపిస్తోంది. రాష్ట్ర పోలీస్‌ శాఖలో కోర్టు మానిటరింగ్‌ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో కేసుల్లో నిందితులకు పడే శిక్ష శాతం తగ్గిపోతోందన్న భావన అధికార వర్గాల్లో కనిపిస్తోంది. టెక్నాలజీ వినియోగంలో మెరుగుపడ్డా... మానిటరింగ్‌ విధానంలో మాత్రం ఇంకా అనేక విప్లవాత్మక మార్పులు రావాల్సి ఉందనడానికి ఇలాంటి వ్యవహారాలే నిదర్శనం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top