పంచాయతీ కార్యదర్శి బలవన్మరణం 

Panchayat Secretary Deceased In Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : ‘నేను తీసుకున్న ఈ నిర్ణయంతో ఏ ఒక్కరికీ సంబంధం లేదు.. కుటుంబసభ్యులు, స్నేహితులను ఇబ్బంది పెట్టొద్దు.. ఈ ఉద్యోగం, జీవితం ఇలా గడపటం ఇష్టం లేకే నేను చనిపోతున్నా.. నా మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అవయవాలను ఇతరులకు దానం చేయండి’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఓ పంచాయతీ కార్యదర్శి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌ రూరల్‌ ఎస్‌ఐ రమేశ్, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మహబూబ్‌నగర్‌లోని మర్లులో నివాసం ఉంటున్న పంచాయతీ కార్మదర్శి అరుణ్‌చంద్ర(25) గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.

ఉదయం 6.30 ప్రాంతంలో గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న తమ్ముడిని చూసిన ఫణీంద్రబాబు గట్టిగా కేకలు వేయటంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలకొట్టి కిందికి దించి చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అరుణ్‌చంద్ర కొంతకాలంగా హన్వాడ మండలం యారోనిపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. అయితే.. సర్పంచ్‌ సుధారాణి భర్త అనంతరెడ్డి, వార్డుసభ్యుడు తిరుపతయ్య ఆరునెలలుగా వేధించటంతో పాటు విధులకు ఆటంకం కలిగిస్తుండటంతో మానసిక వేదనకు గురై తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌ 25 నుంచి మే 1వ తేదీ వరకు విధులకు వెళ్లడం లేదని, ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు. 

విచారణ జరిపించాలి.. 
యారోనిపల్లి పంచాయతీ కార్యదర్శి అరుణ్‌చంద్ర ఆత్మహత్య వెనుక తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నాయని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలోని రెండు వర్గాలు నిత్యం ఒత్తిళ్లకు గురిచేయటంతో పాటు అదనంగా సర్పంచ్, వార్డుసభ్యులు ధూషించటంతోనే ఆత్మహత్య చేసున్నాడని పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top