దర్శకుడు పా.రంజిత్‌కు కోర్టు అక్షింతలు

Pa Ranjith Facing Problems By Commenting On Rajarajacholan - Sakshi

పెరంబూరు: సినీ దర్శకుడు పా.రంజిత్‌కు కోర్టు అక్షంతలు వేసింది. వివరాలు.. అట్టకత్తి, మెడ్రాస్, కబాలి, కాలా చిత్రాల దర్శకుడు పా.రంజిత్‌ ఇటీవల కుంభకోణం సమీపంలోని తిరుప్పనంద గ్రామంలో దళిత సంఘం నిర్వహించిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఆ వేదికపై ఆయన రాజరాజ చోళన్‌ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. నటుడు కరుణాస్‌ వంటి వారు పా.రంజిత్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇదిలాఉండగా తిరుప్పనంద గ్రామంలో పా.రంజిత్‌ చేసిన వ్యాఖ్యలపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఆయన వ్యాఖ్యలు భారతీయ మతసామరస్యానికి వ్యతిరేకం అని,  తమిళ స్త్రీల మనోభావాలను కించపరచేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా పా.రంజిత్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. ఆ ప్రాంత ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు దర్శకుడు పా.రంజిత్‌పై మతకలహాలను రేకెత్తించడం, శాంతి భద్రతకు భంగం కలిగించడం లాంటి నేరాలపై కేసులు నమోదు చేశారు. దీంతో పా.రంజిత్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉండటంతో ఆయన ముందస్తు బెయిల్‌ కోరుతూ మదురై హైకోర్టు శాఖలో పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో తాను చరిత్రలో ఉన్న విషయాలనే చెప్పానని, తన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాలు వక్రీకరించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌  గురువారం న్యాయమూర్తి రాజమాణిక్యం సమక్షంలో విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది దర్శకుడు పా.రంజిత్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయరాదని వాదించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సమాజంలో మాట్లాడటానికి ఎన్నో విషయాలు ఉండగా ప్రజలు గొప్పగా భావించే రాజరాజచోళన్‌ గురించి ప్రస్థావించాల్సిన అవసరం ఏముందని దర్శకుడు పా.రంజిత్‌కు అక్షింతలు వేశారు. అదే విధంగా ఈ నెల 19 వరకూ దర్శకుడిని అరెస్ట్‌ చేయరాదని ఉత్తర్వులు జారీ చేస్తూ, ఈ కేసుకు సంబంధించి తిరుప్పనంద పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ బదులు పిటిషన్‌ను 19వ తేదీన కోర్టులో దాఖలు చేయాల్సిందిగా ఆదేశించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top