ఆయిల్‌ మాఫియా గుట్టు రట్టు

Oil mafia arrest in kakinada TDP leader son escaped - Sakshi

చిక్కిన చమురు దొంగలు ఆరుగురు అరెస్టు

పరారీలో టీడీపీ నేత కుమారుడు

రెండేళ్లుగా సాగుతున్న దందా

కాకినాడ సాగర తీరంలో.. ఓడల నుంచి స్టోరేజ్‌ ట్యాంకులకు వెళ్లే పైపులైన్లకు కన్నాలు వేసి.. కోట్లాది రూపాయల విలువైన చమురును తస్కరిస్తున్న ఆయిల్‌ మాఫియా గుట్టు రట్టయింది. ఈ ముఠాలోని ఆరుగురిని పోలీసులు  అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు, శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయ కమిటీ చైర్మన్‌ గ్రంధి బాబ్జీ కుమారుడు రాజా మాత్రం పరారీలో ఉన్నారు.

గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఆయిల్‌మాఫియాకు అడ్డుకట్ట పడింది. పైపులకు రంధ్రాలు వేసి చాకచక్యంగా టన్నుల కొద్దీ పామాయిల్‌ను దొంగిలించి మార్కెట్‌కు తరలిస్తున్న ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. రెండేళ్లుగా కొనసాగుతున్న ఆయిల్‌ మాఫియా దందాతో రూ.కోట్లు విలువ చేసే ఆయిల్‌ను దర్జాగా దోచుకుపోయిన మాఫియాకు కళ్లెం పడింది. ఇంత చేసినా.. పోలీసులు మాత్రం ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు గ్రంధి బాబ్జి కుమారుడు గ్రంధి రాజా విషయంలో మాత్రం చూసీచూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలను మూటగట్టుకున్నారు.

కాకినాడ : వాకలపూడి కేంద్రంగా ఆయిల్‌ మాఫియా చెలరేగిపోతోంది. విదేశాల నుంచి ఓడల ద్వారా వచ్చే క్రూడ్‌ ఆయిల్‌ను సముద్రం నుంచి పైపులైన్లతో స్టోరేజ్‌ ట్యాంక్‌లకు తరలిస్తారు. ఈ క్రమంలో పైపులైన్లకు రంథ్రాలు పెట్టి ఆయిల్‌ను దొంగిలించే ఓ మాఫియా చాలా కాలంగా ఇక్కడ పనిచేస్తోంది. ఇందులో కొందరు రాజకీయ పార్టీ నేతల బంధువులు కూడా ఉండడంతో పోలీసులు కూడా చూసీచూడనట్టు వదిలేశారన్న అనుమానాలు ఉన్నాయి.

దందా సాగేదిలా..
తాజాగా వెలుగుచూసిన ఆయిల్‌ మాఫియా వ్యవహారంలో నిందితులు వాకలపూడికి సమీపంలోని పైపులైన్‌ వెళ్లే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ఓ గోడౌన్‌ను అద్దెకు తీసుకున్నారు. బయట తాళాలు వేసి లోపల ఓ అండర్‌ గ్రౌండ్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ను నిర్మించేశారు. పైపులైన్‌కు రంధ్రం చేసి పైపులతో సంపులకు కనెక్షన్లు ఇచ్చి ఆయిల్‌ను తోడేసేవారు. ఇలా గడచిన ఐదారు నెలల్లో వందకు పైగా ట్యాంకర్ల ఆయిల్‌ను ఇక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలించేశారు.

బయటపడిందిలా..
ఓడల నుంచి వచ్చే ఆయిల్‌కు సంస్థ నుంచి బయటకు పంపే సరుకుకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉండడంతో సదరు ఎన్‌సీఎస్‌ సంస్థ యాజమాన్యానికి సందేహం కలిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూపీ లాగారు. స్టోరేజ్‌ ట్యాంక్‌కు సమీపంలో ఈ తతంగమంతా జరుగుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ఇందులో ఎన్‌సీఎస్‌ సంస్థకు చెందిన కొంత మంది సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

నిందితుల్లో టీడీపీ నేతలు
పట్టుబడ్డ ఆయిల్‌ మాఫియా కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అధికార టీడీపీ నేతల ప్రమేయం ఉందనే ఆధారాలు దొరకడంతో అవాక్కయ్యారు. చోరీ చేసిన ట్యాంకర్ల కొద్దీ ఆయిల్‌ను జిల్లా టీడీపీ వాణిజ్యవిభాగం అధ్యక్షుడు గ్రంథి బాబ్జికి చెందిన ధనలక్ష్మి ఆయిల్స్‌కు విక్రయించేవారని దర్యాప్తులో తేలింది. ఈ షాపును బాబ్జి తనయుడు రాజా నిర్వహిస్తున్నట్టుగా తేల్చారు. అయితే కేవలం దొంగిలించిన ఆయిల్‌ను రాజా కొనుగోలు చేసినట్టుగా పోలీసులు చెబుతున్నా మాఫియాతో కూడా అతనికి లింకులు ఉన్నాయని సమాచారం. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కుమారుడు కావడం, వీరికి ఎమ్మెల్యేలు, మంత్రులు అండ ఉండడంతో ఇతడిని కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

అంధుడైనా సిద్ధహస్తుడు
ఆయిల్‌ను చాకచక్యంగా చోరీ చేసే వ్యవహారాల్లో బొంతు నారాయణ సిద్ధహస్తుడని పోలీసుల విచారణలో తేలింది. గతంలో నెల్లూరులో ఇదే తరహా చోరీలు చేస్తూ పట్టుబడడంతో అక్కడ ఇతడిపై దాడిచేసి కళ్లు పీకేశారని స్వయంగా పోలీసులే చెబుతున్నారు. దీంతో అతడిని పోలీసులు కాపాడారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యవహారాలపై అనుభవం ఉన్న ఇతడిని ఎంచుకుని ఇక్కడ మాఫియా తమ దందాను కొనసాగించింది.

ఎవరీ రాజా?
ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు మంగళవారం ఎస్పీ విశాల్‌గున్ని పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. అరెస్టయిన వారిలో బొంతు నారాయణ, మల్లిపూడి శివరామప్రసాద్, మడికి జక్కియ్య, రాము నాగేంద్రకుమార్, ముమ్మిడి శ్రీనివాసరావు, మరో నిందితుడు ఉన్నారు. వీరి నుంచి రెండుటన్నుల ఆయిల్‌తోపాటు ధనలక్ష్మి ఆయిల్‌ కంపెనీకి చెందిన లారీని సీజ్‌ చేసినట్టు చెప్పారు. అయితే ఆయిల్‌ కొనుగోలు చేసిన ‘రాజా’ పరారీలో ఉన్నట్టు మాత్రమే పేర్కొన్నారు. అయితే పోలీసులు ఇచ్చిన లేఖలోగానీ, చెప్పిన సందర్భంలోగానీ ఎక్కడా అతని ఇంటి పేరు, తండ్రిపేరు ప్రస్తావించకుండానే కేవలం ‘రాజా’ అనే పేర్కొనడం గమనార్హం. పై నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో కీలక నిందితుడి విషయంలో కేసును పక్కదారి పట్టించే క్రమంలోనే పోలీసులు అలా వ్యవహరించారంటున్నారు.

సాధారణంగా నిందితులకు సంబంధించి ఇంటిపేరు, తండ్రిపేరు, ముద్దుపేర్లతో సహా ప్రకటించే పోలీసులు కేవలం ‘రాజా’ అని పేర్కొనడం వెనుక ఒత్తిళ్లే కారణమంటున్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడని చెబుతున్నా విచారణ సందర్భంలో అతడిని తప్పించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. ఇప్పటికే గ్రంథి రాజాకు చెందిన ట్యాంకర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో కేసు విషయంలో కూడా వాస్తవాలను మరుగుపరచకుండా కేసుతో ప్రమేయం ఉన్న రాజాను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

ఆయిల్‌ మాఫియా కేసులో అరెస్టైన  రాము నాగేంద్రతో టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు గ్రంథి బాబ్జి కుమారుడు గ్రంథి రాజా(నీలి రంగు చొక్కా)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top