చేయి తడపనిదే..

Officer Demanding Bribe In Eluru Government Office - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలోని మెట్ట ప్రాంతంలో అదొక పట్టణం. ఆ పట్టణంలోని ప్రజలకు ఏ పనైనా అక్కడి మున్సిపల్‌ ముఖ్య అధికారి కనుసన్నల్లోనే జరగాలి. ఏ సెక్షన్‌లో, విభాగంలో పని ఉన్నా ఆ అధికారి అనుమతి లేనిదే ఆ పని ముందుకు సాగదు. ఎవరు ఏ పని కోసం వచ్చినా, వారిని తన వద్దకు పంపాలని సెక్షన్‌ అధికారులకు, సిబ్బందికి ఆయన హుకుం జారీ చేశారు. కార్యాలయంలో ఎవరైనా, ఏదైనా పనికోసం వస్తే తానే ‘డీల్‌’ చేసుకుంటానని, మీరెవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చారు. దీంతో అక్కడి అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అవాక్కయ్యారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలంతా దేవుడిని దర్శించుకున్న తరువాతే పూజారి వద్దకు వెళ్లాలన్న చందంగా మారింది పరిస్థితి. అధికారికి ముడుపులు అందితేనే ఏ ఫైల్‌ అయినా కదులుతోంది. ఏ పనైనా జరుగుతోంది. ఆ అధికారి వసూలు చేసే మామూళ్ల బాధలు తట్టుకోలేక, పనులు జరగక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో ఎవరికి ఏ పని వచ్చినా అతనిని కలిసి ముడుపులు చెల్లించాకే పని అవుతుందని బాహాటంగానే చెబుతున్నారు. తననెవరు ఏం చేస్తారనే తీరులో అధికారి వసూళ్ల పర్వం కొనసాగించడంపై సర్వత్రా విమర్శలు                             వినిపిస్తున్నాయి.

పట్టణ ప్రణాళికా విభాగంలో తలదూర్చి 
► పట్టణంలో ఒక మల్టీ షాపింగ్‌మాల్‌ నిర్మిస్తున్నారు. దానిని నిర్మించే వ్యక్తి అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. అయితే అనుమతులు వచ్చే లోగా పనులు ప్రారంభించడంతో ఆ అధికారి పనులు ఆపిం చేశారు. షాపింగ్‌మాల్‌ నిర్మించే వ్యక్తిని కార్యాలయానికి పిలిపించి మామూళ్లు వసూలు చేసినట్లు అక్కడి సిబ్బంది బహిరంగంగానే చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆ నిర్మాణదారుడు తాను అధికారికి రూ.లక్ష ఇచ్చానని, పనులు ఎందుకు ఆపాలని కార్యాలయం వద్దే కేకలు వేయడంతో పలువురు నిర్ఘాంతపోయారు. 
► మరొక వ్యక్తి మరొక షాపింగ్‌ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. నిర్మాణ అనుమతుల కోసం ఆయన ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అనుమతులు వచ్చే లోగా భూమిని చదును చేసుకునే పనిని చేపట్టారు. అంతే అధికారికి తెలిసింది. వెంటనే నిర్మాణదారుడిని కార్యాలయానికి పిలిపించి మామూళ్లు డిమాండ్‌చేయడంతో ఆయన పూర్తిగా నిర్మాణాన్ని ఆపివేసి అనుమతులు వచ్చాకే చేస్తానని స్పష్టంచేశారు. 
► ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు ఒక సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. దానికి మున్సిపాలిటీ ఎన్‌ఓసీ ఇవ్వాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్నా ఎన్‌ఓసీ ఇవ్వకుండా కాలయాపన చేశారు. చివరికి అధికారికి రూ.30 వేలు ముడుపులు ఇస్తేనే గానీ ఎన్‌ఓసీ రాలేదు.  
► వాస్తవానికి పట్టణంలో ఇళ్లు, భవనాల నిర్మాణాల కోసం చలానా చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, సిబ్బంది దానిని పరిశీలించి ఆన్‌లైన్‌లోనే అనుమతులు ఇస్తారు. 

భవనం నిర్మించుకునే వ్యక్తి కార్యాలయానికే రావాల్సిన అవసరం లేదు. అయితే ఆ అధికారి మాత్రం ఎవరు నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్నా తనకు తెలియకుండా అనుమతులు ఇవ్వొద్దని, దరఖాస్తు చేసుకున్న వ్యక్తులను కార్యాలయానికి పిలిపించి ‘డీల్‌’ సెటిల్‌ చేసుకుంటున్నారు. 

మచ్చుకు మరికొన్ని ఉదాహరణలు 
► రెవెన్యూ విభాగంలో ఆస్తిపన్ను విధించాలని దరఖాస్తు చేసుకున్నా.. ముఖ్య అధికారి చేయి తడపాల్సి వస్తోంది. లేకపోతే పని కావట్లేదు. సాల్వెన్సీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఆ అధికారికి మామూళ్లు చెల్లించకుండా ఒక్క సర్టిఫికెట్‌ మంజూరు కావట్లేదు. పట్టణంలోని  వారపు సంత, రోజువారీ మార్కెట్‌ పాటదారులనూ ఆ  అధికారి వదలలేదు. ఆశీల వసూలుకు వారపు సంత, రోజువారీ మార్కెట్‌ పాటలు పాడుకున్న పాటదారులను కార్యాలయానికి పిలిపించి నా వాటా ఎంత అని నేరుగా అడిగేయడంతో వారు అవాక్కవుతున్నారు. ఒక్కొక్క పాటదారుడు తనకు రూ.లక్ష ఇవ్వాలని ఆ అధికారి డిమాండ్‌ చేయడం చర్చనీయాంశమైంది. 
► ఇంజినీరింగ్‌ విభాగ అధికారులూ తనకు చెప్పకుండా ఏ పనీ చేయకూడదని ఆ అధికారి హుకుం జారీ చేశారు. కాంట్రాక్టర్‌ పనులు చేయాలన్నా, వారికి బిల్లులు చెల్లించాలన్నా వారితో మాట్లాడుకున్న తరువాతే సంబంధిత ఫైలు కదులుతోంది. ఇక వివిధ రకాల 
► సర్టిఫికెట్‌లకు వసూళ్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. పందుల పెంపకందార్లను కూడా వదలకుండా మామూళ్లు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
సిబ్బంది, అధికారుల ఆవేదన 
► తన అనుమతి లేనిదే ఏ పనీ చేయవద్దని ముఖ్య అధికారి వేధించడంతో సిబ్బంది, అధికారులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి దృష్టికి అధికారులు, సిబ్బంది తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఉదయం నుంచి అర్ధరాత్రి , తెల్లవారుజాము వరకూ కూడా సిబ్బందిని కార్యాలయంలో ఉంచి వేధిస్తున్నట్లు వాపోతున్నారు. ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రి సమయంలో కూడా ఫోన్‌ చేసి వేధింపులకు గురిచేస్తుండటంతో ఆమె ఎవరికీ చెప్పుకోలేక లోలోనే మదనపడుతున్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top