వృత్తి  సీఏ... ప్రవృత్తి దొంగతనాలు! | Occupation CA and his propensity is robberies | Sakshi
Sakshi News home page

వృత్తి  సీఏ... ప్రవృత్తి దొంగతనాలు!

Nov 20 2017 2:49 AM | Updated on Aug 30 2018 5:27 PM

Occupation CA and his propensity is robberies - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అతడి వృత్తి చార్టెడ్‌ అకౌంటెంట్‌.. స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌.. ఉన్నత చదువు చదువుకున్న అతగాడు దోపిడీ దొంగగా మారాడు.. మహారాష్ట్ర, తెలంగాణతోపాటు 5 రాష్ట్రాల్లో పంజా విసురుతున్నాడు.. తన ‘స్నేహితురాలు’, అనుచరునితో కారులో సంచరిస్తూ సుదూర కాలనీల్లోని ఒంట రి ఇళ్లను టార్గెట్‌ చేశాడు.. ఇలా ఏడాది కాలంలో ఈ గ్యాంగ్‌ ఐదు రాష్ట్రాల్లో 50కి పైగా నేరాలు చేసి 20 కేజీల బంగారం ఎత్తుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. 

నాగ్‌పూర్‌ ‘సిమ్‌’లతో ప్రారంభం.. 
ఇండోర్‌కు చెందిన ఈ ఘరానా దొంగ చార్టెడ్‌ అకౌంటెంట్‌ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇండోర్‌ లో కాక వేరే ప్రాంతంలో ఓ కారును అద్దెకు తీసుకుం టాడు. తన ‘స్నేహితురాలి’తో పాటు డ్రైవర్‌గా వ్యవహరించే అనుచరుడితో కలసి బయలుదేరతాడు. ఈ గ్యాంగ్‌ స్వరాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఎలాంటి నేరం చేయదు. తొలుత ఈ బృందం మహారాష్ట్రలోని నాగ్‌ పూర్‌ చేరుకుంటుంది. అక్కడే 2 సిమ్‌లు, ఫోన్లు ఖరీ దు చేసి వినియోగిస్తారు. నాగ్‌పూర్‌లో చోరీతో ప్రారంభించి రాష్ట్రంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ వరుసగా చోరీలు చేస్తూ ఏపీ, తమిళనాడు, కర్ణాటక వెళ్తారు. 

పగటిపూటే చోరీలు..
కారులో సంచరించే ఈ గ్యాంగ్‌ పగటిపూటే చోరీలు చేస్తుంది. ప్రధాన, జాతీయ రహదారులకు సమీపంలోని కాలనీలను ఎంచుకుంటుంది. ఖరీదైన ఇంటిని గుర్తించి.. దానికి తాళం వేసి ఉంటే క్షణాల్లో పని ముగించేస్తుంది. ప్రధాన చోరుడు తాళం పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించగా.. అనుచరుడు బయట ఉండి ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తుంటాడు. ఆ సమీపంలో నిలిపి ఉంచిన కారులో ‘స్నేహితురాలు’ఉంటుంది. చోరీ చేస్తున్నంత సేపూ ప్రధాన చోరుడు, అనుచరుడు ఫోన్‌లో కనెక్ట్‌ అయ్యే ఉంటారు. నగరంలోని తిరుమలగిరి, ఆదిభట్ల తదితర ప్రాంతాల్లో ఈ గ్యాంగ్‌ పంజా విసిరింది. నగరంలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల మధ్య చోరీలకు పాల్పడింది. ఇండోర్‌ చేరుకోవడానికి ముందే ఆధారాలు లేకుండా సిమ్‌లు, ఫోన్లను ధ్వంసం చేస్తుంది. 

చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు.. 
చోరీ కోసం ప్రధాన చోరుడు ఓ ఇంట్లోకి వెళ్లగా.. సమీపంలో నిలిపిన కారులో ఓ మహిళ కూర్చుని ఉండటం, సమీపంలో మరో వ్యక్తి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండటంతో అనుమానించిన అధికారులు వారిని నిలదీశారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే అనుచరుడి ఫోన్‌ ప్రధాన చోరుడి ఫోన్‌తో కనెక్ట్‌ అయి ఉండటంతో ఇదంతా విన్న అతడు ఆ ఇంటి వెనుక వైపు నుంచి జారుకున్నాడు. చాకచక్యంగా వ్యవహరించి ప్రధాన చోరుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన రాచకొండ పోలీసులు గ్యాంగ్‌లో మరికొందరు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ ముఠాను ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. బంగారం రికవరీపైనా దృష్టి పెట్టారు.  

ముప్పుతిప్పలు పెట్టిన ముఠా.. 
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసుల్ని ఈ ముఠా ముప్పుతిప్పలు పెట్టింది. 6 నెలల కాలంలో దఫదఫాలుగా పంజా విసిరింది. అనేక ఘటనాస్థలాలకు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో వీరు వినియోగించిన కారు, కదలికలు రికా ర్డు అయినప్పటికీ చాలాకాలం వరకు 3 కమిషనరేట్ల అధికారులు పట్టుకోలేకపోయారు. కొన్ని రోజుల క్రితం మరోసారి ఈ గ్యాంగ్‌ సిటీకి వచ్చింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సంచరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞా నం వినియోగించి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement