పేట్రేగుతోన్న విద్వేషం ; అంబేద్కర్‌ విగ్రహం కూల్చివేత

Now Ambedkars statue vandalised In UPs Mawana - Sakshi

మీరట్‌ : ఈశాన్య రాష్ట్రం త్రిపురలో బీజేపీ గెలుపు అనంతరం మొదలైన ధ్వంసరచన దేశమంతా విస్తరిస్తున్నది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లా మనావాలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం కూల్చివేతకు గురైంది. మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కొందరు విగ్రహం తలను, విరగొట్టి కిందపడేసి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన దళితులు బుధవారం ఉదయం నుంచి ఆందోళనలకు దిగారు. మవానా రహదారిపై బైఠాయించి, విద్వేషకారులకు వ్యతికేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డకునే సమయంలో కొంత ఉద్రిక్తత తలెత్తింది.

గంటలపాటు రాస్తారోకో చేసిన దళితులు.. నిందితులను పట్టుకునేదాకా ఆందోళన విరమించబోయేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఉపశమన చర్యగా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. విగ్రహం కూల్చివేతకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని,  ప్రస్తుతం మనావాలో పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి హింసాయుత ఘటనలు నమోదుకాలేదని పోలీసులు తెలిపారు.

మొన్న లెనిన్‌, నిన్న పెరియార్‌, ముఖర్జీ.. ఇప్పుడు అంబేద్కర్‌ : త్రిపురలో బీజేపీ వర్గీయులు లెనిన్‌ విగ్రహాన్ని కూల్చిన తర్వాత ఆ పార్టీకే చెందిన తమిళనాడు నేతలు ‘ఇక పెరియార్‌ విగ్రహాలు కూల్చుతాం’అని ప్రకటన చేశారు. ఆ మేరకు వేలూరు సహా కొన్ని జిల్లాల్లో పెరియార్‌ విగ్రహాలు ధ్వసమయ్యాయి. త్రిపుర ఘటకు ప్రతీకారంగా పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనసంఘ్‌ స్థాపకుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తెలిసిందే. విగ్రహాల ధ్వంసాలు కూడదంటూ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఒక ప్రకటన చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top