నెల్లూరు సరిహద్దుల్లో పార్ధిగ్యాంగ్‌..!

Nellore Police Alerted, Famous Parthi Gang Moves In District Boundaries - Sakshi

అప్రమత్తమైన జిల్లా పోలీస్‌ యంత్రాగం

ఆయుధాలతో గస్తీ ముమ్మరం

కనిపిస్తే కాల్చేయాలని సిబ్బందికి ఎస్పీ ఆదేశం

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌) : దేశంలోనే అత్యంత కరుడు గట్టిన నరరూప రాక్షసులుగా పిలువబడే పార్ధిగ్యాంగ్‌  చిత్తూరు–తమిళనాడు, చిత్తూరు–నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తుందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో జిల్లా పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ శుక్రవారం సిబ్బందితో సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్ధిగ్యాంగ్‌ కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి వెంబడి, రైల్వేస్టేషన్‌ సమీప ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. నిందితులు దాడులకు తెగబడే అవకాశమున్న దృష్ట్యా గస్తీ సిబ్బంది విధిగా ఆయుధాలు (షాట్‌ వెపన్స్‌)ను వెంట ఉంచుకోవాలన్నారు. అవసరమైతే కాల్చివేయడానకి వెనుకాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు.

ఎవరీ పార్ధిగ్యాంగ్‌!
మహారాష్ట్ర–మధ్యప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు. మహారాష్ట్రలోని చత్రీ, పర్బాని, నాసిక్, ఇంజన్‌ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాధ్, మధ్యప్రదేశ్, భూపాల్‌ తదితర ప్రాంతాల్లో వీరు నివసిస్తుంటారు. వీరి కుటుంబాల్లో అందరూ దోపిడీలు, దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తులు. కుటుంబాలతో ఉపాధి కూలీల్లా ఇతర ప్రాంతాలకు తరలి వెళుతారు. గ్రామ సరిహద్దులు, పట్టణ శివార్లు, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిల కింద, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌ల సమీపంలో గుడారాలు వేసుకుని సంచార జీవనం సాగిస్తారు. మహిళలు పగటి వేళల్లో పరిసర ప్రాంతాల్లో చిత్తుకాగితాలు ఏరుకోవడం, పిన్నీసులు, పూసలు అమ్మడం, యాచకుల్లా జీవనం చేస్తూ తమ పనులకు వీలుగా ఉండే ఇంటిని లక్ష్యంగా ఎం చుకుంటారు. రాత్రి వేళల్లో ఆ ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతారు. ఆ సమయంలో వారి కదలికలను ఎ వరూ గుర్తుపట్టకుండా ఉండేలా జాగ్రత్త పడుతారు.

ఆనవాళ్లు దొరక్కుండా..
వీరు దొంగతనం చేసే ఇంటికి వెళ్లిన సమయంలో తమ ఆనవాళ్లను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వీరి వ్యవహారశైలి అత్యంత క్రూరంగా ఉంటుంది. లక్ష్యంగా ఎంచుకొన్న ఇంట్లో భయానక వాతావరణం సృష్టిస్తారు. ఇంట్లో ఉన్న చిన్న, పెద్దా, వృద్ధులు, వికలాంగులు తేడా లేకుండా అందర్ని అతి క్రూరంగా (రాడ్‌లు, కర్రలతో తలపై విచక్షణా రహితంగా కొట్టడం, కత్తులతో గొంతులు కోయడం) మట్టుపెట్టి అందిన కాడికి దోచుకెళుతారు. నేరానికి పాల్పడే సమయంలో ఎవరు అడ్డొచ్చినా వారిని హత మారుస్తారు.  పార్ధి గ్యాంగ్‌లు సుమారు 10 ఉండొచ్చని పోలీసులు అంచనా. ఒక్కో బృందంలో 14 నుంచి 20 మంది సభ్యులు ఉంటారని సమాచారం. గ్యాంగ్‌లో పురుషులే కాదు మహిళలు సైతం చురుగ్గా వ్యవహరిస్తారు.

ఈ గ్యాంగ్‌కు సంబంధించిన పలువురిని 2014లో వరంగల్, 2015లో విశాఖ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2015 ఆగస్టులో కండి జైలు నుంచి సంగారెడ్డి కోర్టుకు తరలిస్తున్న నలుగురు పార్థిగ్యాంగ్‌ సభ్యులు తప్పించుకున్నారు.
2005లో నెల్లూరులో దొంగతనం పార్ధిగ్యాంగ్‌ గతంలో నెల్లూరులో దొంగతనానికి పాల్పడింది. 2005లో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎంజీ బ్రదర్స్‌ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. రెండు రోజులు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డారు. ఇంటి కుక్కలకు మత్తు బిస్కెట్‌లు వేసి వాచ్‌మన్‌ను హత్య చేశారు. ఈ ఘటన అప్పట్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద కలకలం సృష్టించింది. కావలిలోనూ ఇదే తరహాలో నేరానికి పాల్పడినట్లు సమాచారం.

అప్రమత్తంగా ఉండాలి
జిల్లా సరిహద్దులో పార్ధిగ్యాంగ్‌ సంచరిస్తుందన్న సమాచారం. ముందస్తు చర్యల్లో భాగంగా సిబ్బం దిని అప్రమత్తం చేశాం. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, కొత్తవారు తారసపడితే వెంటనే డయల్‌ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. 
– పీహెచ్‌డీ రామకృష్ణ, జిల్లా ఎస్పీ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top