అనైతిక బంధం హత్యకు పురిగొల్పింది

Nataraj Murder Case Mystery Reveals Visakhapatnam police - Sakshi

వివాహేతర బంధానికి అడ్డు తొలగించుకునేందుకే భర్త హత్యకు కుట్ర

ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి ప్రణాళిక రచించిన భార్య

నటరాజు హత్య కేసు ఛేదించిన ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులు

ఇద్దరు రిమాండ్‌కు తరలింపు ∙పోలీసుల అదుపులో నిందితురాలు

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): పెళ్లికి ముందే దారి తప్పింది. ఆ అనైతిక బంధాన్ని పెళ్లి తర్వాత కూడా కొనసాగించింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న భర్త మందలించడంతో... ఏకంగా భర్తనే అడ్డు తొలగించేస్తే వివాహేతర బంధానికి ఏ ఇబ్బందీ ఉండదని భావించింది. అనుకున్నదే తడువుగా ప్రియుడు, అతని స్నేహితునితో కలిసి ప్రణాళిక రచించి అంతమొందించారు. 104 ఏరియాలో సంచలనం రేపిన నటరాజ్‌ హత్యకేసును ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులు ఛేదించారు. ఏసీపీ లంక అర్చున్‌ ఆదివారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... కొబ్బరితోటకు చెందిన నటరాజ్‌కు అదే ప్రాంతానికి చెందిన పార్వతితో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది.

అయితే అప్పటికే పార్వతికి జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన మినరల్‌ వాటర్‌ కేన్‌లు ఇంటింటికీ సరఫరా చేసే మురళి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా ఆ బంధాన్ని కొనసాగించింది. ఈ నేపథ్యంలో నటరాజు దుబాయ్‌ వెళ్లడంతో మరికొంత స్వేచ్ఛ లభించింది. మురళి స్నేహితుడు కొమ్మాది ప్రాంతానికి చెందిన కూర్మాన గణేష్‌ ఇంట్లో తరచూ ప్రియుడు మురళితో పార్వతి గడిపేది. దుబాయ్‌ నుంచి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్న నటరాజ్‌ భార్యతోపాటు మురళీని మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. అయినప్పటికీ వారి తీరులో మార్పు రాకపోవడంతో కొద్ది నెలల కిందట మురళిపై నటరాజ్‌ దాడి చేశాడు. దీనిపై అప్పట్లో రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదయింది.

ప్రాంతం మారినా మారని తీరు
నటరాజ్, పార్వతి దంపతులకు పదేళ్ల కుమార్తె, ఐదేళ్ల పాప ఉన్నారు. ఈ క్రమంలో కొబ్బరితోట ప్రాంతంలో ఉంటే భార్య ప్రవర్తన వల్ల నిత్యం గొడవలు జరుగుతున్నాయని, వేరే ప్రాంతానికి వెళ్తే ప్రశాంతంగా గడపవచ్చని నటరాజ్‌ భావించాడు. దీంతో 104 ఏరియా సమీపంలోని బాపూజీనగర్‌ ప్రాంతంలో ఆరు నెలల కిందట ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నటరాజ్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయినప్పటికీ పార్వతి తీరులో మార్పు రాకపోవడంతో ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో తన వివాహేతర బంధానికి అడ్డంగా ఉన్న భర్తనే తొలగించుకోవాలని పార్వతి భావించింది. అనంతరం ప్రియుడు మురళిని సంప్రదించి అతని స్నేహితుడు కొమ్మాది ప్రాంతానికి చెందిన గణేష్‌ ఇంటిలోనే ప్రణాళిక రచించారు.

పక్కా ప్రణాళికతో హత్య
హత్యకు ప్రణాళిక రచించిన మురళి, పార్వతి, గణేష్‌ ముందుగా ఓ ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలో కత్తిని బుక్‌ చేసుకున్నారు. అది వచ్చిన తర్వాత హత్యకు సిద్ధమయ్యారు. ఈ నెల 18వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో 104 ఏరియా నుంచి నటరాజ్‌ నడుచుకుంటూ బాపూజీనగర్‌లోని ఇంటికి వస్తున్నాడు. అప్పటికే ఆ ప్రాంతంలో మాటువేసిన మురళి, గణేష్‌ వెనుక నుంచి బీరు బాటిళ్లతో నటరాజ్‌పై దాడి చేశారు. అనంతరం కత్తితో విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. నటరాజ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు భిన్నకోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మురళి, గణేష్‌లను ఆదివారం రిమాండ్‌కు తరలించారు. పార్వతిని తమ అదుపులో ఉంచి విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top