ఆ దాడి చేసింది మేమే: విజయ్‌

Murder Attempt To Case Mahabubnagar Crime News - Sakshi

అభంగాపూర్‌ వాసి ఆశప్పపై వేటకొడవళ్లతో గురువారం రాత్రి జరిగిన దాడి సంచలనం రేకెత్తించింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే గ్రామపంచాయతీ ఎన్నికలు సైతం ప్రశాంతంగా జరుగుతున్నాయని భావిస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడంతో అటు గ్రామస్తులు.. ఇటు అధికారుల్లో ఒక్కసారిగా ఆందోళన చోటు చేసుకుంది. ఈ మేరకు ఆశప్ప హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అభంగాపూర్‌ గ్రామంలో మాత్రం శుక్రవారం నిశ్శబ్దం అలుముకుంది. గ్రామం జన సంచారం లేక బోసిపోగా పలువురి ఇళ్లకు తాళాలు పడ్డాయి. ఇక పోలీసులు భారీగా గ్రామంలో మొహరించి ఎలాంటి ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ క్రైం: మహబూ బ్‌నగర్‌ జిల్లా నారాయణపేట మండలం అ భంగపూర్‌ గ్రామంలో భూ‘పంచాయితీ’, పాత ‘పగ’ సాధింపు చర్యలు 20 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి మాట దేవుడెరుగు ఎప్పుడు చూసినా ఆదిపత్య పోరే కనిపిస్తుంది. ఇరువర్గాల మధ్య పరస్పర దాడులతో తరచూ ఏదోఒక సం ఘటన చోటుచేసుకుంటూనే ఉంటుంది. దీంతో ఎప్పుడు ఏం  జరుగుతుందో తెలియక ప్రరజలు భయాందోళనతోనే కాలం గడుపుతుంటారు.
 
మొదటినుంచీ అదే పంచాయితీ!
గ్రామంలోని చెన్నప్ప, ఆశప్ప కుటుంబీకుల్లో మొదటినుంచీ పంచాయితీలు నడుస్తూనే ఉన్నాయి. భూ తగదాలతోనే 1999 నుంచి ఆదిపత్య పోరు కొనసాగుతున్నాయి. భూముల విషయంలోనే ఆశప్ప అనుచరులు చెన్నప్ప ఇంటిపై అప్పట్లో బాంబుల దాడికి పాల్పడ్డారని స్థానికులు చెబుతారు. అందులో భాగంగానే కోయిల్‌కొండ మండల సమీపంలో బస్సులో వస్తున్న చెన్నప్ప కుటుంబసభ్యులను కొందరిని అప్పట్లో హతమార్చారని ప్రచారం జరిగింది. అలాగే కోర్టుకు వస్తున్న చెన్నప్ప కుటుంబసభ్యులను అప్పక్‌పల్లి, అమ్మిరెడ్డిపల్లి  గ్రామాల మధ్యలో హత్యచేశారనే ఆరోపణల నేపథ్యంలో పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనల్లో ఆశప్ప పాత్ర ఉన్నట్లు అప్పట్లో పోలీసు కేసులు నమోదు చేశారు. కానీ వాటికి సరైన సాక్ష్యాధారాలు లేక కోర్టులో కేసులు వీగిపోయినట్లు తెలిసింది.

నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆశప్ప 
మరికల్‌ దగ్గర జరిగిన హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన ఆశప్పను బుధవారం రాత్రి చికిత్స కోసం మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్టర్‌ జీవన్‌ ఆధ్వర్యంలో వైద్యం అందించగా రక్తం అధికంగా పోవడంతో పాటు న్యూరోసర్జరీ అత్యవసరం కావడంతో రాత్రి 11గంటలకు హైదరాబాద్‌కు రెఫర్‌ చేశారు. అయితే ప్రస్తుతం ఆశప్ప నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గ్రామం నిర్మానుష్యం
ఆశప్పపై దాడి జరిగిన సంఘటనతో బుధవారం రాత్రి నుంచి అభంగపూర్‌ గ్రామం నిర్మాణుషంగా మారింది. ఎస్పీ రెమారాజేశ్వరి ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీధర్‌ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్‌ఐలు, 40 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేస్తూ 144 సెక్షన్‌ విధించారు. గ్రామంలో జనసంచారం లేకుండా పోయింది. కొంత మంది భయభ్రాంతులకు గురై ఇళ్లకు తాళాలు వేసి వారి పక్క గ్రామాల్లోని బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లకు వెళ్లిపోయారు. 

దాడిచేసింది మేమే : విజయ్‌
అభంగపూర్‌ ఆశప్పపై దాడి చేసిన సంఘటనలో తన హస్తమే ఉందని ఆ గ్రామానికి చెందిన చెన్నప్ప కుటుంబసభ్యుడు విజయ్‌ ఓ ప్రైవేట్‌ చానల్‌ ముందుకు వచ్చి వెల్లడించాడు. 20 ఏళ్ల క్రితం మా ఇంటిపై ఆశప్ప వర్గీయులు భూ వ్యవహరంలో బాంబుల దాడికి పాల్పడ్డారని, 2001లో కోయిలకొండ మండలం వింజమూర్‌ గ్రామ సమీపంలో బస్సులో మా ఇద్దరి కుటుంబసభ్యులపై దాడి చేసి హత్య చేశారని, 2004 అప్పక్‌పల్లిలో మరో ఇద్దరి కుటుంబసభ్యులను హత్య చేయించాడని చెప్పారు.

వాటిని జీర్ణించుకోకనే నేను క్రిమినల్‌గా మారాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పటి నుంచి ఆశప్పపై కసి పెంచుకొని పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి, అలియాస్‌ సూరి వద్ద అనుచరుడిగా చేరానని తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో వారి కుటుంబసభ్యులు పోటీచేస్తున్నారని, ఎవరూ నిలబడొద్దంటూ గ్రామంలో పలువురిని బెదిరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో మరికల్‌ సమీపంలో ఆశప్ప తమకు కనబడటంతో హతమర్చేందుకు ప్రయత్నించానని వెల్లడించారు. త్వరలోనే నారాయణపేట డీఎస్పీ, మరికల్‌ సీఐల ముందు లొంగిపోతానని చెప్పడంతో పోలీసులు ఊపిరిపిల్చుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top