నా పైనే దాడి చేస్తారా?

Motkupalli Narasimhulu Demand To Arrest Bikshamaiah Goud - Sakshi

భిక్షమయ్యగౌడ్‌ను అరెస్టు చేయాలి: మోత్కుపల్లి 

సాక్షి, యాదాద్రి: ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌ల ప్రచారంలో తలెత్తిన ఘర్షణ వివాదాస్పదమైంది.  

అసలు ఏం జరిగింది? 
బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి మోత్కుపల్లి తన అనుచరులతో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌ యాదగిరిగుట్ట మండలంలో చేపట్టిన బైక్‌ ర్యాలీ మల్లాపురంలో మోత్కుపల్లి ప్రచారానికి ఎదురుపడింది. ఈ సమయంలో ఇరువురు పరస్పరం అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే టవేరా వాహనం మోత్కుపల్లి ప్రచార వాహనాన్ని తాకడంతో అక్కడ వివాదం తలెత్తింది.

అయితే కాంగ్రెస్‌ కార్యకర్తలు తన ప్రచారాన్ని అడ్డుకుని తనపై దాడి చేశారని మోత్కుపల్లి రోడ్డుపై బైఠాయించారు. నాపై దాడి చేస్తారా అంటూ మోత్కుపల్లి కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ నాయకుడు కర్ర వెంకటయ్య తన అనుచరులతో వచ్చి మోత్కుపల్లికి సంఘీభావం తెలిపారు. రాస్తారోకో చేస్తున్న మోత్కుపల్లిని ఆందోళన విరమించాలని యాదగిరిగుట్ట ఏసీపీ మనోహర్‌రెడ్డి కోరారు. భిక్షమయ్యగౌడ్‌ను అరెస్టు చేస్తేనే ఆందోళన విరమిస్తానని భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు మోత్కుపల్లిని అరెస్టు చేసి తుర్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

తుర్కపల్లి పీఎస్‌లోనూ మోత్కు పల్లి దీక్ష కొనసాగించారు. భిక్షమయ్యగౌడ్‌పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోత్కుపల్లిపై జరిగిన దాడిని నిరసిస్తూ గోదావరి నదీ జలాల సాధన సమితి బుధవారం ఆలేరు బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ తెలిపారు. దాడి జరగలేదని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌ స్పష్టం చేశారు. 

భిక్షమయ్యను అరెస్ట్‌ చేయాలి: మోత్కుపల్లి 
‘‘ఎన్నికల ప్రచారంలో ఉన్న నాపై దాడికి కారకుడైన భిక్షమయ్యగౌడ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి. నాపై కావాలనే కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్‌ అండ చూసుకుని మల్లాపురంలో ప్రచారాన్ని అడ్డుకున్నారు. నా వాహనాన్ని ఢీ కొట్టారు. చేయి చేసుకున్నారు. నియోజకవర్గంలో నాకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక భిక్షమ య్యగౌడ్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు’’. 

ఒప్పందం బయటపడింది: భిక్షమయ్యగౌడ్‌
‘‘టీఆర్‌ఎస్‌ పార్టీతో మోత్కుపల్లి నర్సింహులు కుదుర్చుకున్న ఒప్పందం బయటపడింది. నా వాహనం మోత్కుపల్లి వాహనానికి తాకినా, నేను ఆయనను తిట్టినట్లు తేలినా రాజకీయాలను వదిలిపెడతా. నేను అనుమతి తీసుకుని బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నాను. ప్రచారంలో భాగంగా ఇద్దరం మల్లాపురంలో ఎదురుపడ్డాం.. పరస్పరం అభివాదం చేసుకున్నాం. నాపై ఆరోపణలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.’’ 

భిక్షమయ్యగౌడ్‌పై అట్రాసిటీ కేసు 
తుర్కపల్లి: మోత్కుపల్లి ఫిర్యాదు మేరకు భిక్షమయ్య గౌడ్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు 279, 504, 506, 143 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐ ఆంజనేయులు తెలిపారు.

దాడిని ఖండిస్తున్నాం: బీఎల్‌ఎఫ్‌ 
సాక్షి,హైదరాబాద్‌: బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు ప్రచార యాత్రపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) చైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం అన్నారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top