సోదరి వరస యువతిపై మృగాడి దాష్టీకం | Molestation on Dumb And Deaf Woman in Prakasam | Sakshi
Sakshi News home page

సోదరి వరస యువతిపై మృగాడి దాష్టీకం

Dec 6 2019 12:47 PM | Updated on Dec 6 2019 12:47 PM

Molestation on Dumb And Deaf Woman in Prakasam - Sakshi

బుధవారం అర్ధరాత్రి ఉప్పలపాడులో వివరాలు సేకరిస్తున్న పోలీసు అధికారి

పుట్టుకతోనే మూగ, చెవుడు, మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఆమెకు ఆకలి అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి అభాగ్యురాలు మదమెక్కిన ఓ కామాంధుడి పశువాంఛకు బలైంది. సోదరుడి వరుసయ్యే మానవ మృగం పైశాచికంగా ప్రవర్తిస్తుంటే మాటలు కూడా రాని ఆమె మౌనంగా రోదించడం మినహా ఏమీ చేయలేక పోయింది. బాధితురాలికి నిందితుడు అన్న వరస కావడం గమనార్హం. ఒకవైపు దిశ ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ఆందోళనలు చల్లారక ముందే వలేటివారిపాలెం మండలం జమీన్‌ ఉప్పలపాడులో బుధవారం ఇలాంటి ఘటనే జరగడం జిల్లా వాసులను
ఆందోళన కలిగిస్తోంది.

కందుకూరు: వలేటివారిపాలెం మండలం జమీన్‌ ఉప్పలపాడు ఎస్సీ కాలనీకి చెందిన యువతి (27) పుట్టుకతోనే మూగ, చెవుడుతో పాటు మానసిక వైకల్యంతో జన్మించింది. తల్లి మరణించగా ప్రస్తుతం తండ్రితో కలిసి ఉంటోంది. ఆమె తన అన్న కుమారుడు సూర్యతో కలిసి బైక్‌పై గ్రామంలోనే రేషన్‌షాపు వద్దకు వెళ్లింది. సరుకులు తీసుకున్న తర్వాత వాటితో ఆమె మేనల్లుడు బైక్‌పై ఇంటికి వెళ్లిపోయాడు. ఆమె రేషన్‌షాపు నుంచి ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆమె వెనుకాలే సోదరుడు వరసైన ఎండ్లూరి ప్రభాకర్‌ (50) వస్తున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ప్రభాకర్‌ ఆమెపై కన్నేశాడు. అదునుచూసి పక్కనే ఉన్న పొగాకు బ్యారన్‌లోకి లాక్కెళ్లాడు. అనంతరం కన్నుమిన్నూ కానకుండా లైంగికదాడికి పాల్పడ్డాడు. పుట్టుమూగ కావడంతో గట్టిగా కేకలు కూడా వేయలేని దయనీయ స్థితి ఆమెది. రేషన్‌షాపునకు వెళ్లిన ఆమె తిరిగి ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో వెతకడం ప్రారంభించారు. దాదాపు గంటపాటు గాలించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు పొగాకు బ్యారన్‌ వద్దకు వెళ్లి తలుపులు తీసి పరిశీలించారు. బదిర యువతి జీవితాన్ని చిదిమేసిన ప్రభాకర్‌ వారిని గమనించి లుంగీ భుజంపై వేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. తనకు ఏం జరిగిందో కూడా తెలియని నిస్సహాయ స్థితిలో మూగగా రోదిస్తూ ఆమె బ్యారన్‌లో ఓ మూలన దీనంగా పడి ఉంది. బాధిత యువతిని గుర్తించి బంధువులు బయటకు తీసుకొచ్చారు. ప్రభాకర్‌ అమెపై లైంగిక దాడికి తెగబడినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని చికిత్స కోసం కందుకూరులోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

ఆయనకు వరుసకు ఆమె చెల్లి
బాధిత యువతి నిందితుడికి దూరపు బంధువు. ఆమెకు అన్న వరుస అవుతాడు. ఆయనకు ప్రస్తుతం భార్య, ముగ్గురు కుమారులతో పాటు కుమార్తె ఉంది. ఒక కుమారుడికి వివాహం కాగా మిగిలిన వారు గ్రామంలోనే ఉంటున్నారు. కుమార్తె వయసున్న యువతిపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణమంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. బేల్దారి పనులు చేసే ప్రభాకర్‌ నిత్యం మద్యం తాగుతూ గ్రామంలోనే ఉంటాడు. పెళ్లికి ముందు కూడా ప్రభాకర్‌ ప్రవర్తన వివాదాస్పదంగా ఉండేదని గ్రామస్తులు చెప్తున్నారు. 

పోలీసుల అదుపులో నిందితుడు?
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కందుకూరు డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ బదిర యువతిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం కేసు సీఐ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement