మెడికల్ షాప్‌ పేరిట మోసం..రూ.5 లక్షల టోకరా

కరీంనగర్‌ : హైదరబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్లో మెడికల్ షాప్స్ ఇప్పిస్తానని అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని  కరీంనగర్‌ రెండవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన బల్మురీ అనిల్ కుమార్ ఇంజనీరింగ్ చదువు ముగించుకుని,ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. కరీంనగర్‌లోని కాశ్మీరుగడ్డకు చెందిన న్యాలకొండ సుమన్‌తో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. అతని నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేద్దామనుకున్నాడు.

హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్లో మెడికల్ షాప్స్ పెట్టుకోవడానికి టెండర్లు పిలిచారని, అందులో టెండర్ వచ్చి షాప్ పెట్టుకుంటే అధిక లాభాలతో పాటు ఉపాధి లభిస్తుందని, అలా రప్పించడానికి తనకు చాలా మంది రాజకీయ నాయకులు, అధికారులు తెలుసునని, అందుకు రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని మాయమాటలు చెప్పి నమ్మించాడు. అనిల్‌ అది నిజం అనుకుని డబ్బులను ఆన్‌లైన్‌ ద్వారా అతని బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్‌ చేశాడు. తర్వాత టెండర్ ఎప్పుడు వస్తుందని పలు మార్లు అడుగగా రేపు మాపు అంటూ కాలం వెళ్లదీశాడు. అనుమానంతో అనిల్‌ నిమ్స్ హాస్పిటల్‌కి వెళ్లి తెలుసుకోగా మోసపోయానని గ్రహించాడు.

ఈ విషయమై నిందితుడిని నిలదీయగా డబ్బులు ఇస్తానని చెప్పి, అప్పటి నుంచి కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఎన్ని మార్లు ప్రయత్నించిన స్పందించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని కదలికలపై నిఘా ఉంచిన టాస్క్ ఫోర్స్ అధికారులు అతనిని ఎట్టకేలకు చాకచక్యంగా అరెస్ట్ చేసి, 2వ పట్టణ పోలీసుల సహాయంతో రిమాండ్‌కి తరలించారు. నిందితుడు ఇలా చాలా మందిని ఈ తరహాలో నమ్మించి, రూ.50 లక్షల వరకు మోసం చేశాడని తెలిసింది. ఇతనికి సహకారం అందించిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో టాస్క్ ఫోర్స్ అధికారాలు వివరాలు సేకరిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top